Share News

రూ.18లక్షల అప్పు.. అనుష్క శర్మ ఆర్డర్‌తో రెస్టారెంట్ దశే మారిపోయింది!

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:21 PM

ఓ చిన్న చోలే బటూరే షాప్.. అప్పుల ఊబిలో కూరుకుపోయి మూసేయాలని నిర్ణయించుకుంది ఆ యాజమాన్యం. కానీ అనూహ్యంగా స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రెస్టారెంట్ దశ తిరిగిపోయింది.

రూ.18లక్షల అప్పు.. అనుష్క శర్మ ఆర్డర్‌తో రెస్టారెంట్ దశే మారిపోయింది!
Anushka Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్న చోలే బటూరే షాప్.. అప్పుల ఊబిలో కూరుకుపోయి మూసేయాలని నిర్ణయించుకుంది ఆ యాజమాన్యం. కానీ అనూహ్యంగా స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రెస్టారెంట్ దశ తిరిగిపోయింది. రోజుకు వేలాది ప్లేట్ల చోలే బటూరే అమ్మకాలు జరుపుతూ రూ.కోట్లలో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆ రెస్టారెంట్ కథేంటో తెలుసుకుందామా..!


ముంబైలోని చెంబూర్‌లో ఉన్న ‘ఢిల్లీ సే’ రెస్టారెంట్‌ 2021 అక్టోబర్‌లో జస్పాల్‌ సింగ్‌ ఖాల్సా, మహీందర్‌ సింగ్‌ ఖాల్సా అనే సోదరులు ప్రారంభించారు. కేవలం 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు టేబుళ్లు, తొమ్మిది సీట్లతో ఈ షాప్‌ను ప్రారంభించారు. కానీ పెద్దగా అమ్మకాలు లేకపోవడంలో దాదాపు రూ.18లక్షల అప్పు అయింది. ఇక ఆ షాప్‌ను మూసేద్దామని నిర్ణయించుకున్నారట. ఒకరోజు ఓ స్టాండప్ కమెడియన్ ఈ షాప్‌లో చోలే బటూరే తిని ఇన్‌స్టాలో రివ్యూ ఇవ్వడంతో అది అనుష్క శర్మ దృష్టికి వెళ్లింది.


విరాట్‌ కోహ్లీ కోసం రెండు ప్లేట్ల ఆర్డర్‌..

భర్త విరాట్‌ కోహ్లీకి ఢిల్లీ స్టైల్‌ చోలే బటూరే అంటే ఎంతో ఇష్టమని తెలిసిన అనుష్క.. ముంబైలో అసలైన ఢిల్లీ రుచులు దొరికే చోటు కోసం వెతికారు. చివరకు ‘ఢిల్లీ సే’ నుంచి రెండు ప్లేట్ల చోలే బటూరే ఆర్డర్‌ చేశారు. అయితే.. చెంబూర్‌ నుంచి జూహూకు డెలివరీ చేయాలని ఫోన్‌ రావడంతో జస్పాల్‌కు మొదట అది ప్రాంక్‌ కాల్‌ అనిపించింది. అప్పట్లో ఒక ప్లేట్‌ ధర కేవలం రూ.120. కానీ చెంబూర్‌ నుంచి జూహూ వెళ్లి రావడానికి అయ్యే ఖర్చే ఆర్డర్‌ విలువ కంటే ఎక్కువ. డెలివరీ ఖర్చు కూడా చెల్లిస్తామని, బ్యాంక్‌ వివరాలు ఇవ్వాలని అవతలి వ్యక్తి చెప్పడంతో జస్పాల్‌ మరింత అనుమానపడ్డారు.


‘ఆమె ఎనిమిదిసార్లు ఫోన్‌ చేసి బ్యాంక్‌ వివరాలు అడుగుతోంది. ఇదేదో సమస్యలా ఉందని నా సోదరుడితో చెప్పాను. ఖాతాలో డబ్బులే లేవు.. నెగెటివ్‌ బ్యాలెన్స్‌లో ఉందని అతను చెప్పాడు’ అని జస్పాల్‌ నవ్వుతూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. చివరకు ఆ ఫోన్‌ విరాట్‌ కోహ్లీ ఇంటి నుంచి వచ్చిందని తెలియడంతో జస్పాల్‌ షాక్‌ అయ్యారు. అయినప్పటికీ నమ్మలేకపోయారు. ‘మేడమ్‌.. అలా అనకండి. విరాట్‌ కోహ్లీ ఎక్కడ? నేను చెంబూర్‌లో ఓ చిన్న చోలే బటూరే దుకాణం నడుపుతున్న వ్యక్తిని. మీరు కోహ్లీ ఇంటి నుంచి ఫోన్‌ చేస్తున్నారని ఎలా నమ్మాలి?’ అని అడిగారట. అయితే.. ‘మమ్మల్ని నమ్మండి. లేదంటే మంచి అవకాశాన్ని కోల్పోతారు’ అని అవతలి వ్యక్తి చెప్పడంతో చివరకు ఫుడ్ డెలివరీకి అంగీకరించారు.


అనుష్క పోస్టుతో ఒక్కసారిగా పెరిగిన రద్దీ..

ఆర్డర్‌ను కోహ్లీ ఇంటికి చేర్చిన తర్వాత అసలు కథ మొదలైంది. కొద్దిసేపటికే రెస్టారెంట్‌ సిబ్బందికి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు కనిపించింది. ముంబైలో ఎట్టకేలకు ‘అచ్చం ఢిల్లీ తరహా చోలే బటూరే’ దొరికిందని అనుష్క ఆనందం వ్యక్తం చేశారు. విరాట్‌ కోహ్లీకి చోలే బటూరే అంటే ఎంత ఇష్టమో కూడా ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆమె పోస్టు చేసిన తర్వాత రెస్టారెంట్‌ ముందు భారీగా జనం గుమిగూడారు. అరగంటలోనే అంత పెద్ద క్యూ ఏర్పడటంతో మాకేం చేయాలో అర్థం కాలేదు. జనం భారీగా చేరడంతో రెస్టారెంట్ బయట పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది’ అని జస్పాల్‌ తెలిపారు.


ఇప్పుడు రూ.కోట్లలో వ్యాపారం!

‘ఢిల్లీ సే’ ప్రస్తుతం చెంబూర్‌, ములుంద్‌, అంధేరీ వెస్ట్‌, వాషి ప్రాంతాల్లో నాలుగు ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. యజమానుల ప్రకారం.. అన్ని ఔట్‌లెట్లలో కలిపి రోజుకు 3 వేలకుపైగా చోలే బటూరే ప్లేట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా నెలకు రూ.2 కోట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సోదరులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ ధమాకా.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

వృద్ధాశ్రమంలో వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్

Updated Date - Sep 27 , 2026 | 05:12 PM