వృద్ధాశ్రమంలో వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:42 PM
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని థానేలో ఓ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో కాంబ్లీ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని థానేలో ఓ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో కాంబ్లీ చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఓల్డెజ్ హోంలో ఉన్న అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కాంబ్లీ మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతునట్లు కనిపించారు. మాటలు స్పష్టంగా పలకలేక తడబడుతున్నప్పటికీ.. తన అభిమానులకు మాత్రం భరోసా కల్పించేలా మాట్లాడారు. తనకు అందుతున్న వైద్యం, సంరక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
‘ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇక్కడి సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఉంటున్నప్పుడు ఇంటికి దూరంగా ఉన్నాననే భావన కలగడం లేదు. ఇక్కడి సిబ్బంది నుంచి ఎంతో ప్రేమ, గౌరవం లభిస్తోంది’ అని కాంబ్లీ వీడియోలో వెల్లడించారు.
కాగా.. కొంతకాలంగా కాంబ్లీ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టులో ఆయన నడవడానికి ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అంతకుముందే ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. 2013లో కాంబ్లీకి గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. 2024 చివర్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, కండరాల తిమ్మిరి, కళ్లు తిరగడం, జ్వరంతో డిసెంబర్‌లో థానేలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తదుపరి పరీక్షల్లో మెదడులో రక్తం గడ్డలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన కాంబ్లీ.. 2025 జనవరి 1న డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ క్రికెట్ బ్యాట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒకప్పుడు భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన కాంబ్లీ ప్రస్తుత పరిస్థితి అభిమానులను కలచివేస్తోంది. సచిన్ టెండూల్కర్‌తో కలిసి రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆయన.. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. భారత్ తరఫున కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 54.20 సగటుతో 1,084 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 2,477 పరుగులు చేశారు. 1991 నుంచి 2000 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు