Share News

మన కూత.. బంగారు మోత

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:42 AM

ఆసియా క్రీడల్లో ఏడో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు.. శనివారంనాడు ఏకంగా రెండు పసిడి పతకాలతో దుమ్ము రేపారు..కబడ్డీ మహిళలు, పురుషులు అద్భుత కూతతో గత....

మన కూత.. బంగారు మోత

  • కబడ్డీలో రెండు స్వర్ణాలు

  • మారథాన్‌లో చారిత్రక రజతం

  • మూడు పతకాలతో అథ్లెట్లు అదరహో

  • షూటింగ్‌లో రజతం

  • స్క్వాష్‌లో కాంస్యం

ఆసియా క్రీడల్లో ఏడో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు.. శనివారంనాడు ఏకంగా రెండు పసిడి పతకాలతో దుమ్ము రేపారు..కబడ్డీ మహిళలు, పురుషులు అద్భుత కూతతో గత క్రీడల స్వర్ణాలను నిలబెట్టుకొన్నారు..ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు జోరు కొనసాగిస్తూ రెండు రజతాలు, ఒక కాంస్య పతకం కొల్లగొట్టారు..గురి తప్పని షూటర్ల ఖాతాలో మరో రజతం చేరింది..స్క్వా్‌షలో కంచు మోత మోగింది..మొత్తంగా ఈరోజు మనోళ్లు ఏడు పతకాలతో భళా అనిపించారు. తద్వారా భారత్‌ 30 పతకాలతో పట్టికలో టాప్‌-10లోకి దూసుకొచ్చింది.

నగోయ: ఆసియా క్రీడలు కొనసాగుతున్న కొద్దీ భారత ఆటగాళ్ల ప్రదర్శన ఇనుమడిస్తోంది. శనివారం నాటి పోటీల్లో కబడ్డీ జట్లు, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు, షూటర్లతోపాటు స్క్వాష్‌ ప్లేయర్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత మహిళలు, పురుషుల కబడ్డీ జట్లు ఆసియాడ్‌లో తమకు ఎదురులేదని నిరూపించాయి.. గత క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన జట్లు ఇక్కడా అదే ప్రదర్శన పునరావృతం చేశాయి. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో మహిళల జట్టు 37-34తో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను మట్టి కరిపించి మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. పురుషుల జట్టు కూడా 40-34తో ఇరాన్‌ను చిత్తు చేసి స్వర్ణంతో మురిసింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల కబడ్డీలో భారత పురుషుల జట్టుకు ఇది తొమ్మిదో బంగారు పతకం కాగా.. మహిళల బృందానికిది నాలుగో పసిడి కావడం విశేషం.


11-sports.jpg

షూటర్ల మహిళా త్రయం.. రజత ఆనందం

షూటింగ్‌లో జోరు కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో తిలోత్తమా సేన్‌, విదర్సా వినోద్‌, అషీ చోక్సీలతో కూడిన భారత త్రయం రజత పతకం పట్టేసింది. ఫైనల్స్‌లో భారత బృందం 1763 పాయింట్ల స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. చైనా (1773 పాయింట్లు) స్వర్ణం, కజకిస్థాన్‌ (1754) కాంస్యం చేజిక్కించుకున్నాయి.

స్క్వాష్‌ ఫైనల్లో అనహత్‌, అభయ్‌

జోష్న జోడీ.. కాంస్యంతో సరి

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కేటగిరీలో జోష్న చిన్నప్ప/వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ ద్వయం కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. సెమీఫైనల్లో జోష్న/సెంథిల్‌ జోడీ 10-11, 11-2, 10-11తో హాంకాంగ్‌ జంట లీ కా/టాంగ్‌ మింగ్‌ చేతిలో ఓటమి పాలైంది. కాగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో అనహత్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాలను ఖాయం చేసుకొన్నారు. సెమీస్‌లో అనహత్‌ 3-2తో సటోమి ఒటనబె (జపాన్‌)పై, అభయ్‌ 3-0తో మహమ్మద్‌ ఇర్ఫాన్‌ (పాకిస్థాన్‌)పై నెగ్గారు. ఫైనల్లో నెగ్గితే వీరిద్దరికీ ఒలింపిక్‌ బెర్త్‌లు ఖరారవుతాయి.


ప్రాచీ.. పారా హుషార్‌

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత మహిళా అథ్లెట్ల జోరు శనివారం కూడా కొనసాగింది. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచీ చౌధరి 53.21 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకం కైవసం చేసుకుంది. బహ్రెయిన్‌కు చెందిన సల్వా నాసర్‌ (49.20సె.) క్రీడల రికార్డు టైమింగ్‌తో స్వర్ణం, జహ్రా జరేయి (ఇరాన్‌, 52.38సె.) రజతం గెలిచారు.

12-sports.jpg

తూర్‌..హ్యాట్రిక్‌ స్వర్ణం మిస్‌

గత రెండు ఆసియా క్రీడల పురుషుల షాట్‌పుట్‌లో స్వర్ణాలతో దుమ్మరేపి..ఈసారి క్రీడల్లో హ్యాట్రిక్‌కు గురిపెట్టిన తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌కు నిరాశ ఎదురైంది. చిత్తడి పరిస్థితుల్లో జరిగిన షాట్‌పుట్‌ ఫైనల్లో 31 ఏళ్ల తూర్‌ ఈ సీజన్‌లో అత్యుత్తమంగా 20.64 మీటర్ల దూరం గుండు విసిరి రజత పతకంతో వెనుదిరిగాడు. అయితే వరుసగా మూడు ఆసియాడ్‌లలో పతకాలు సొంతం చేసుకున్న సంతృప్తి తూర్‌కు మిగిలింది. మహ్మద్‌ రెజా (ఇరాన్‌, 20.81 మీ.) ఆసియాడ్‌ రికార్డుతో స్వర్ణం, మహ్మద్‌ తోలు (సౌదీఅరేబియా, 20.48మీ.) కాంస్య పతకం నెగ్గారు.

15-sports.jpg

మారథాన్‌లో 44 ఏళ్ల నిరీక్షణకు తెర

మారథాన్‌ రన్నర్‌ సావన్‌ బర్వల్‌ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించాడు. పురుషుల మారథాన్‌ (42.195 కి.మీ.) ఫైనల్లో 2 గంటలా 11.37 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన బర్వల్‌ వ్యక్తిగత, జాతీయ రికార్డు టైమింగ్‌తో అనూహ్యంగా రజత పతకం సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆసియాడ్‌ పురుషుల మారథాన్‌లో 44 ఏళ్ల భారత్‌ పతక నిరీక్షణకు ముగింపు పలికాడు. చివరిసారి 1982 న్యూఢిల్లీ ఆసియాడ్‌లో హోసూర్‌ కుక్కప్ప సీథరన్‌ కాంస్యం తర్వాత ఈ విభాగంలో దేశానికి పతకం అందించిన మారథాన్‌ రన్నర్‌గా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఆర్మీమన్‌ సావన్‌ రికార్డు నెలకొల్పాడు. ఇచికటక యమషిట (జపాన్‌, 2:10.49) స్వర్ణం, పియు ఫెంగ్‌ (చైనా, 2:12.13) కాంస్య పతకం నెగ్గారు. ఈ విభాగంలో పోటీపడిన మరో భరత రన్నర్‌ కార్తిక్‌ కర్కేరా 19 మందిలో 17వ స్థానంలో నిలిచాడు.

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో

మిగతా భారత అథ్లెట్ల ఫలితాలు

  • పురుషుల 1500 మీటర్ల రేసులో గుల్వీర్‌ సింగ్‌, యూనస్‌ షా ఫైనల్‌కు అర్హత సాధించారు.

  • మహిళల 1500 మీటర్ల రేసు ఫైనల్స్‌లో పారుల్‌ చౌదరి నాలుగో స్థానం, పూజ ఆరో స్థానాల్లో నిలిచారు. 400 మీటర్ల ఫైనల్లో విశాల్‌ ఐదో స్థానంతో రేసు ముగించాడు.

  • పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ తొలి రోజు ముగిసేసరికి 4338 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు.

  • పురుషులు, మహిళల 200 మీటర్ల రేసులో అనిమేష్‌, హరిత, ఉన్నతి తుదిపోరులో నిలిచారు.

10-sports.jpg

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 05:44 AM