రో-కోపైనే కళ్లన్నీ!
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:28 AM
అఫ్ఘానిస్థాన్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ విన్యాసాలను అభిమానులు మిస్ అయ్యారు. తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను...
మధ్యాహ్నం 2 గం. నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌లో..
విండీస్‌తో భారత్ తొలి వన్డే నేడు
కెప్టెన్ గిల్ ఫిట్
అఫ్ఘానిస్థాన్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ విన్యాసాలను అభిమానులు మిస్ అయ్యారు. తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను స్వదేశంలో ఆడబోతున్న భారత జట్టులో కోహ్లీతో పాటు రోహిత్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్ ఈ జోడీకి ఆఖరిది కావడంతో వీళ్ల ఆటతీరు కూడా కీలకం కానుంది. అలాగే మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఆడేది కొన్ని మ్యాచ్‌లే. అందుకే ఈ సిరీస్ చక్కటి సన్నాహకంగానూ ఉపయోగపడనుంది.
తిరువనంతపురం: ఈ ఏడాది భారత వన్డే క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్‌లతో సిరీస్‌లను ఆడింది. అయితే ఈ మూడింట్లో జట్టు గెలిచింది అఫ్ఘాన్‌పై మాత్రమే. అందుకే వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే వన్డే వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే సరైన ట్రాక్‌లో తమ సన్నాహకాలు ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆదివారం నుంచి వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను గిల్ సేన ఆడబోతోంది. ఈనేపథ్యంలో తొలి మ్యాచ్‌కు స్థానిక గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ సిరీస్‌కు బుమ్రా, హార్దిక్, శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉండడం లేదు. ఇక వెటరన్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ విండీస్‌పై సత్తా చూపి తమ ఫామ్‌ను నిరూపించుకోవాలనుకుంటున్నారు. అటు పర్యాటక జట్టు మాత్రం శ్రీలంక, న్యూజిలాండ్‌లపై సిరీస్‌లు కోల్పోయి బలహీనంగా కనిపిస్తోంది. భారత గడ్డపై ఈ జట్టు చివరిసారి 2002లో వన్డే సిరీస్ గెలవడం గమనార్హం.
చరిత్రకు చేరువలో విరాట్: విరాట్ కోహ్లీ వన్డేల్లో 15 వేల రన్స్ పూర్తి చేసేందుకు 59 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే అతడికి విండీస్‌పై 66.50 సగటు ఉండడం విశేషం. ఈ ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతుండడంతో విరాట్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన 6 వన్డేల్లో అతను 106.66 స్ట్రయిక్ రేట్‌తో ఉన్నాడు. అటు రోహిత్ సైతం అఫ్ఘాన్‌తో సిరీస్‌లో రాణించాడు. కెప్టెన్ గిల్ నెట్స్‌లో గాయపడినప్పటికీ ఈ మ్యాచ్‌కు అతను ఫిట్‌గానే ఉన్నట్టు సమాచారం. దీంతో రోహిత్-గిల్ ఓపెనర్లుగా రానున్నారు. శ్రేయాస్, అక్షర్ ఆసియా గేమ్స్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో మిడిలార్డర్‌లో రుతురాజ్, రాహుల్ కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్లుగా జడేజా, నితీశ్‌లపై భారం పడనుంది. పేస్ విభాగంలో సిరాజ్, ప్రసిద్ధ్‌లకు జతగా అకీబ్, నమన్, బ్రార్‌ల మధ్య పోటీ నెలకొంది. కుల్దీప్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడనున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, గిల్ (కెప్టెన్), విరాట్, రుతురాజ్, రాహుల్, జడేజా, నితీశ్ కుమార్, నమన్ ధిర్/బ్రార్/నబీ, కుల్దీప్, ప్రసిద్ధ్, సిరాజ్.
వెస్టిండీస్: క్యాంప్‌బెల్, గ్రీవ్స్, కార్టీ, హోప్ (కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, చేజ్, ఫోర్డ్, మోటీ, సీల్స్/జోసెఫ్, అల్జారి, విటెల్ లావెస్.
పిచ్: ఇప్పటిదాకా రెండు వన్డేలు మాత్రమే జరిగిన ఈ మైదానం పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే 2018లో విండీస్ చివరిసారి ఇక్కడ ఆడినప్పుడు జడేజా నాలుగు వికెట్లతో వణికించాడు.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు