జీవితమంతా భిక్షాటన చేస్తూ.. పైసా పైసా కూడబెట్టింది.. చివరికి..
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:37 PM
జీవితమంతా భిక్షాటన చేస్తూ పైసా పైసా కూడబెట్టింది. అయితే చివరికి ఆ సంపదను అనుభవించకుండానే కన్నుమూసింది. కర్ణాటకలో 68 ఏళ్ల హూర్ కథ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని మాండ్యలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన 68 ఏళ్ల హూర్ అనే మహిళ ఇంట్లో ఏకంగా రూ.8.40 లక్షల నగదు బయటపడింది. వృద్ధాప్య సమస్యలతో ఇటీవలే మృతి చెందారు. ఆమె మరణం అనంతరం స్థానికులు ఇంట్లో పరిశీలించగా.. 30కి పైగా బస్తాల్లో దాచిన నోట్ల కట్టలు, వేల సంఖ్యలో నాణేలు కనిపించాయి. వాటిలో ఎక్కువగా రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. బస్తాల్లోని నగదును బయటకు తీసి లెక్కించగా మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హూర్ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివసించేవారని.. ఆమె సోదరి రెండేళ్ల క్రితమే మరణించారని స్థానికులు తెలిపారు. ఇద్దరికీ వివాహం కాలేదని.. హూర్ చాలా ఏళ్లుగా భిక్షాటనపైనే ఆధారపడి జీవించినట్లు వెల్లడించారు.
జీవితమంతా కష్టపడి కూడబెట్టిన ఆ నగదును.. వాడుకోకుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. ఆమె వద్ద లభించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. హూర్ సోదరుల్లో ఒకరికి రూ.6 లక్షలు, మరో సోదరుడికి రూ.2.40 లక్షలు అందాయి. తనకు వచ్చిన మొత్తాన్ని రెండో సోదరుడు మసీదుకు విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. చిన్నచిన్న మొత్తాలను భిక్షగా స్వీకరిస్తూ ఏళ్ల తరబడి పొదుపు చేస్తే ఇంత పెద్ద మొత్తంగా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. నోట్లతో పాటు భారీగా నాణేలు కూడా బస్తాల్లో లభించడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..
కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్!