తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఈస్టర్ ఎగ్ హంట్’
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:15 AM
చిన్నారుల కోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం కాలేజ్ విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో ఆదివారం (ఏప్రిల్ 12వతేదీ) ఘనంగా నిర్వహించింది.
వాషింగ్టన్: చిన్నారుల కోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం కాలేజ్ విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో ఆదివారం (ఏప్రిల్ 12వతేదీ) ఘనంగా నిర్వహించింది. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో.. తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కో ఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్ నిలిచింది. రంగు రంగుల గుడ్లతోపాటు ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స్’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. ఈ వేడుకల్లో వారి నవ్వులు, కేరింతలు అసలైన పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి పిజ్జా అందజేశారు. ఈ ఆటలను పక్కా ప్రణాళికతో ఈవెంట్ కో ఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో వీరు కీలక పాత్ర పోషించారు. పెద్దలతోపాటు పిల్లలకు నిర్వహించిన ఆటలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి మిడ్ - అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారంపై ప్రశంసల జల్లు కురుపించారు. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలు నిర్వహించడంలో వీరి ఉత్సాహంతోపాటు టీం వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు తెలిపారు. వాలంటీర్లతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీగా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు.

ఈ వేడుకల్లోని మధుర క్షణాలను తన కెమెరాలో విశ్వనాథ్ కోగంటి ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం ఆయా కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ.. వారి కృషికి గుర్తింపుగా వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీంతోపాటు వాలంటీర్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

సేవ, సంతోషంతోపాటు సంఘీభావంతో మనం కలిసి ముందుకు సాగుదామని తానా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా రవి పుట్లూరు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ తానా నాయకులు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు
For More NRI News And Telugu News