ఛార్లెట్‌లో తానా ఆదర్శవంతమైన సేవ.. రక్తదానం చేసిన సభ్యులు
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:41 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని ఛార్లెట్ నగరంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో తమ బాధ్యతను చాటుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఛార్లెట్‌లోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నాయకులు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
అమెరికన్ రెడ్‌క్రాస్, ‘సాయి అనుగ్రహ’ సంస్థలతో కలిసి తానా నాయకులు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ.. దాతలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. నిర్దేశించుకున్న 20 యూనిట్ల లక్ష్యాన్ని మించి.. మొత్తం 21మంది దాతల ద్వారా 21 యూనిట్ల రక్తాన్ని(19 హోల్ బ్లడ్, 2 పవర్ రెడ్) సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తం దాదాపు 63 మంది ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా బోర్డ్ డైరెక్టర్ మల్లి వేమన, పూర్వ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస గోగినేని, సోషల్ వెల్ఫేర్ కో-ఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, ఛార్లెట్‌లోని తానా నాయకులు రవి(నాని) వడ్లమూడి, నాగ పంచుమర్తి , ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరితో పాటు ఇతర స్థానిక నాయకులు హాజరై దాతలను, నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా అమెరికన్ రెడ్‌క్రాస్, సాయి అనుగ్రహ సంస్థల భాగస్వామ్యానికి, ముఖ్యంగా ఎంఆర్‌కే.కిషోర్ సహకారానికి తానా బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తీవ్ర ఎండనూ లెక్కచేయకుండా దాతలకు స్వాగతం పలుకుతూ, రిజిస్ట్రేషన్లు సమన్వయం చేస్తూ నిరంతరం శ్రమించిన వలంటీర్ల సేవలను నాయకులు కొనియాడారు. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, కార్యక్రమ విజయానికి కృషిచేసిన అందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి:
సెయింట్ లూయిస్‌లో వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం
ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి వ్యాఖ్య