Share News

ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి వ్యాఖ్య

ABN , Publish Date - Jul 20 , 2026 | 07:17 PM

భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఆర్మీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి దాయాది దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి వ్యాఖ్య
Noreen Niazi Comments on Operation Sindoor

ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని అన్నారు. తన ఓటమిని దాచిపెట్టేందుకు పాక్ ఆర్మీ తప్పుడు కథనాలను వ్యాపింపజేసిందని ఆరోపించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాము భారత్‌పై పైచేయి సాధించినట్టు పాక్ ఆర్మీ అధికారులు ప్రజలకు నమ్మబలికారని నోరీన్ అన్నారు. కానీ, వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని కుండబద్దలు కొట్టారు. తన ఓటమిని దాచి పెట్టేందుకు పాక్ ఆర్మీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని చెప్పుకొచ్చారు.


ఇజ్రాయెల్‌తో కుదిరిన అవగాహన మేరకు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కాస్త సంయమనం పాటించిందని నోరీన్ తెలిపారు. ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ అబ్రహాం అకార్డ్స్‌పై పాక్ సంతకాలు చేసేలా భారత్ తన దాడుల తీవ్రతను కాస్త తగ్గించిందని చెప్పారు. ఇజ్రాయెల్‌తో ఉన్న అవగాహన ఇందుకు కారణమని చెప్పారు. ఇక ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాక్ ప్రారంభించిన మార్కా ఏ హక్‌ ఆపరేషన్‌ విఫలం కాకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ట్రంప్ జోక్యంతో పాక్ పరువు నిలిచిందని అన్నారు. అయితే, తన వాదనలకు తగిన ఆధారాలను మాత్రం ఆమె వివరించలేదు.

ఈ వ్యాఖ్యలపై పాక్‌లో దుమారం రేగుతోంది. అధికార పీఎమ్ఎల్-ఎన్ పార్టీ నోరీన్ వ్యాఖ్యలను ఖండించింది. ఆమె కామెంట్స్ పాక్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడింది. మరోవైపు, ఈ వ్యాఖ్యలపై పాక్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా స్పందించింది. నోరీన్‌కు నోటీసులు జారీ చేసింది. దేశ మిలిటరీ, ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీసే కామెంట్స్ చేసినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


ఈ వార్తలనూ చదవండి:

హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నిక.. అధికారిక ప్రకటన విడుదల!

వారి రాక కోసం ఎదురుచూస్తున్నాం: ఇరాన్ విదేశాంగ ప్రతినిధి

Updated Date - Jul 20 , 2026 | 07:31 PM