ప్రవాసాంధ్రులకు వారధిగా ఉండటం మహాభాగ్యం: జయరాం కోమటి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:22 AM
అమెరికాలోని తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు.
డల్లాస్, జూన్ 1: అమెరికాలోని తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగలిగే ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తినిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా నడుచుకుంటానని చెప్పారు.

డల్లాస్‌లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోమటి జయరాంకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జయరాం మాట్లాడుతూ.. మాతృభూమి రుణం తీర్చుకోవడంలో విశిష్ట పాత్ర పోషిస్తోన్న ప్రవాసాంధ్ర తెలుగు వారి సేవలను ప్రత్యేకంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ప్రవాసాంధ్రులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని జయరాం కోమటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

తెలుగువారికి జయరాం గురువుతో సమానం: పెమ్మసాని
అమెరికాలోని అనేకమంది తెలుగువారికి జయరాం కోమటి గురువుతో సమానమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనతో కలిసి తాను కూడా అమెరికా అంతటా పర్యటించానని గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాలతో సహా ప్రతి రాష్ట్రంలోని తెలుగువారితో విస్తృత పరిచయాలు ఉన్న వ్యక్తి మరొకరు లేరని పెమ్మసాని కితాబిచ్చారు. ఎన్ఆర్ఐలు అందరికీ జయరాం కోమటి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని, నిజానికి ఆయన కార్యదీక్ష సమర్థతలకు ఈ పదవి చాలా చిన్నదని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.

జయరాం భోళా మనిషి: రఘురామకృష్ణరాజు
జయరాం కోమటి భోళామనిషి అని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది పార్టీ నాయకులకు పరోక్షంగా జయరాం ఎంతో మద్దతు అందించారని, అండగా నిలిచారని వివరించారు.
ప్రవాసాంధ్రులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం: కొండపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కాదలుచుకునే ప్రవాసాంధ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుందని, రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ప్రవాసాంధ్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేయగల కీలక బాధ్యతలను జయరాం కోమటి గొప్పగా నిర్వర్తించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికా పర్యటన అంటే గుర్తొచ్చే పేరు జయరాం: గంటా శ్రీనివాస్
అమెరికా పర్యటన, ప్రవాసాంధ్రులు అనగానే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు జయరాం కోమటి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు అమెరికాలో పర్యటించినా సరే.. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూస్తూ జయరాం కోమటి తలలో నాలుకలా మెదిలే వారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు గుళ్లపల్లి రామకృష్ణ, కేసీ చేకూరి, సుధీర్ చింతమనేని, సతీష్ కొమ్మన, బసంత్ కంభంపాటి, తేజ జాస్తి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
Read Latest NRI News And Telugu News