Share News

సహన శక్తి

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:12 AM

ఓర్పుగా ఉండాలని, సహనంతో మెలగాలని గురువులందరూ గట్టిగా చెబుతూనే ఉంటారు. అయితే వాటిని ఆచరించి చూపినవారిలో జెన్‌ గురువు మూసో...

సహన శక్తి

జెన్‌ కథ

ఓర్పుగా ఉండాలని, సహనంతో మెలగాలని గురువులందరూ గట్టిగా చెబుతూనే ఉంటారు. అయితే వాటిని ఆచరించి చూపినవారిలో జెన్‌ గురువు మూసో అగ్రగణ్యుడు. ఒకసారి అతను తన శిష్యునితో కలిసి దూరప్రాంతానికి బయలుదేరాడు. అక్కడ వారు టెన్ర్యూ అనే నదిని దాటి వెళ్ళాలి. ఆ నది దగ్గరకు వారు చేరుకొనేసరికి అవతలి ఒడ్డుకు చేరవేసే దోనె (చిన్న పడవ) ఒక్కటీ లేదు. గంట సేపు వారు నిరీక్షించిన తరువాత... ఒక దోనె వచ్చింది. మూసో, అతని శిష్యుడితో సహా అక్కడున్నవారందరూ అందులో ఎక్కారు.

దోనె బయలుదేరుతున్న సమయంలో బాగా దృఢంగా ఉన్న ఒక మల్ల యోధుడు పరుగెత్తుతూ వచ్చి అందులోకి ఎగిరి దూకాడు. దాంతో ఆ దోనె అటూ ఇటూ ఊగింది. మునిగిపోకుండా ఎలాగో నిలదొక్కుకుంది. ఆ మల్ల యోధుడు మద్యం మత్తులో ఉన్నాడు. ఒక చోట ఉండకుండా గట్టిగా అడుగులూ వేస్తూ తిరుగుతున్నాడు. అప్పుడు... దోనె నడుపుతున్న వ్యక్తి ‘‘అయ్యా! తమరు దయచేసి ఒక చోట నిమ్మళంగా కూర్చుంటే మన ప్రయాణం బాగా సాగుతుంది. అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకోవచ్చు’’ అన్నాడు. ఆ యోధుడు కోపంతో ‘‘భలే చెప్పావులేవయ్యా! అదిగో అక్కడున్న ఆ జెన్‌ గురువును ఎత్తి నదిలో పడెయ్‌. బాగుంటుంది’’ అన్నాడు మూసో వైపు చూపిస్తూ.

‘‘కొంతసేపు ఓర్పు వహించండి. తీరానికి చేరుకుంటాం’’ అన్నాడు మూసో ప్రశాంతంగా.

‘‘నన్నే ఊరుకోమంటావా? నువ్వు నదిలో దూకుతావా? లేదంటే నేనే నిన్ను ఎత్తి పడెయ్యాలా?’’ అన్నాడు మల్లుడు.

ఇదంతా చూస్తున్న మూసో శిష్యుడికి రక్తం మరుగుతోంది. ‘‘శాంతం, శాంతం’’ అంటున్న మూసోని చూసి మల్లుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోతూ... తన ఇనుప కర్రతో మూసో తల మీద బాదాడు. ఆయన తల నుంచి రక్తం కారడం చూసిన శిష్యుడు పిడికిలి బిగించి లేచాడు. ‘‘వీణ్ణి ప్రాణాలతో వదలను’’ అంటూ మల్లుడి మీద పడడానికి సిద్ధమయ్యాడు.


ఆ శిష్యుడు కూడా బలపరాక్రమాలు ఉన్నవాడే. కుస్తీ పట్టడంలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడే. మూసో అతణ్ణి ఆపాడు. ‘‘ఇంత చిన్న విషయాన్ని అంత తీవ్రంగా పరిగణించి, అతనితో తలపడాలా? అతను మన తోటి ప్రయాణికుడు. ఏదో ఒక చిన్న దెబ్బ వేశాడు. నాలుగు చుక్కల రక్తం కారింది, అంతేగా? కొన్ని నిమిషాల్లో మనం గట్టుకు చేరుతాం. అతని దారిన అతడు, మన దారిలో మనం వెళ్ళిపోతాం’’ అని సర్ది చెబుతూ... ఒక వాకాను రాగయుక్తంగా పాడాడు.

‘వాకా’ అంటే గేయం, పద్యం అని అర్థం. జపాన్‌ భాషలో దాన్ని ‘టంకా’ అని కూడా అంటారు. ‘‘ఇదంతా క్షణికమైన కలలాంటిది. ఇందులో తన్నినవాడు, తన్నులు తిన్నవాడు... ఇద్దరూ పాత్రధారులే’’ అని ఆ టాంకా సారాంశం. మూసో అలా పాడుతూ ఉండగానే.. దోనె తీరానికి చేరింది. మూసో, అతని శిష్యుడు కిందికి దిగి నడుస్తున్నారు. టాంకాలోని సారాంశం, మూసో కనబరచిన సహనం ఆ యోధుడి కళ్ళు తెరిపించాయి. అతను పరుగుపరుగున వచ్చి మూసో ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. ‘‘గురువుగారూ! నన్ను క్షమించండి’’ అని ప్రాధేయపడ్డాడు. అతనికి శిష్యుడయ్యాడు. చిత్తశుద్ధితో కూడిన ఓర్పుకు ఉండే శక్తి అలాంటిది.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 02:12 AM