పశ్చాత్తాపమే పరిహారం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:02 AM
మనిషి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు తెలిసి తప్పు చేస్తాడు. మరికొన్నిసార్లు కోరికలకు బానిసై పాపాల ఊబిలో కూరుకుపోతాడు. అయితే ఎన్ని పాపాలు చేసినా...
సందేశం
మనిషి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు తెలిసి తప్పు చేస్తాడు. మరికొన్నిసార్లు కోరికలకు బానిసై పాపాల ఊబిలో కూరుకుపోతాడు. అయితే ఎన్ని పాపాలు చేసినా... తప్పులను గుర్తించి, నిజమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు వచ్చేవారికి... ఆయన కరుణా ద్వారాలు తెరిచే ఉంటాయి. దానికి ఉదాహరణగా దైవప్రవక్త మహమ్మద్ చెప్పిన కథ ఇది.
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎన్నో ఘోరమైన నేరాలు చేశాడు. తొంభై తొమ్మిది మందిని చంపాడు. కొన్నాళ్ళకు అతని హృదయంలో పశ్చాత్తాపం మొదలయింది. ‘నా పాపాలకు క్షమాపణ లభిస్తుందా? నా జీవితాన్ని మార్చుకొనే అవకాశం ఉందా?’ అనే ఆలోచన అతణ్ణి వెంటాడింది. తన పాపాలకు పరిహారం తెలుసుకోవాలని ఒక ఆరాధకుడి దగ్గరకు వెళ్ళాడు. ‘‘నేను తొంభై తొమ్మిది మందిని చంపాను. నాకు క్షమాపణ దొరుకుతుందా?’’ అని అడిగాడు. ‘‘దొరకదు’’ అన్నాడు ఆ ఆరాధకుడు. ఆ మాటతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి... ఆరాధకుణ్ణి కూడా చంపేసాడు. దాంతో అతని హత్యల సంఖ్య వందకు చేరింది.
కానీ అతని హృదయంలో పశ్చాత్తాపం మాత్రం చావలేదు. తనకు సరైన మార్గం చూపగలిగే వారి కోసం వెతికాడు. చివరకు ఒక జ్ఞానిని కలుసుకొని... తన పరిస్థితి వివరించాడు. అతని మాటలను ఆ జ్ఞాని శ్రద్ధగా విన్నాడు. ‘‘అల్లాహ్ క్షమాపణకు, నీకు మధ్య అడ్డుగా ఎవరు నిలబడగలరు? నీ పశ్చాత్తాపానికి ఫలితం కలిగే అవకాశం తప్పకుండా ఉంది. కానీ నువ్వు నివసిస్తున్న చెడు వాతావరణాన్ని విడిచిపెట్టు. మంచివారు నివసించే ప్రాంతానికి వెళ్ళి, వారితో కలిసి జీవించు. నీ పాత పాపాల మార్గంలోకి తిరిగి వెళ్ళకు’’ అని చెప్పాడు.
ఆ మాటలు అతని హృదయంలో కొత్త ఆశను నింపాయి. తన గత జీవితాన్ని వదిలిపెట్టాడు. మంచి మనుషుల మధ్య జీవించాలనే సంకల్పంతో ప్రయాణం ప్రారంభించాడు. అయితే విధి వేరుగా ఉంది. మార్గమధ్యంలోనే అతనికి మరణం సంభవించింది.
అప్పుడు అతని ఆత్మను ఎవరు తీసుకువెళ్ళాలి? అనే విషయంలో స్వర్గదూతలకీ, నరకదూతలకీ మధ్య వివాదం ఏర్పడింది. అల్లాహ్ ఆజ్ఞతో... అతను వెళ్లాలనుకున్న మంచి ప్రాంతానికి, అతను బయలుదేరిన చెడు ప్రాంతానికి మధ్య దూరాన్ని కొలిచారు. అతను మంచి ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్టు తేలింది. దాంతో అతను అల్లాహ్ కరుణకు పాత్రుడయ్యాడు.
‘‘పాపాలు చేసిన దాసులారా! అల్లాహ్ కరుణ పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ నిశ్చయంగా పాపాలన్నిటినీ క్షమిస్తాడు. అత్యధికంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు ఆయనే’’ అని దివ్య ఖుర్ఆన్ చెబుతోంది. నిజమైన పశ్చాత్తాపంతో, విశ్వాసంతో సత్కార్యాలు చేసేవారి చెడు పనులు సత్కార్యాలుగా మారుతాయని స్పష్టం చేస్తోంది. మనిషి చేసిన పాపం ఎంత పెద్దదైనా... మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటే ద్వారం మూసుకుపోదు. అయితే నోటితో క్షమించమని అడగడం కాదు. తప్పులు చేయడం మానాలి, వాటి పట్ల నిజంగా పశ్చాత్తాపం చెందాలి. మళ్ళీ ఆ తప్పు చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవాలి. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే... అలాంటి చర్యలను సరిదిద్దుకోవాలి. హృదయం మారడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ మార్పును జీవితాంతం నిలబెట్టుకోవడానికి నిజాయితీ, విశ్వాసం, పట్టుదల అవసరం.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News