Share News

కాళీయుని పడగలపై బ్రహ్మ కడిగిన పాదం

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:19 AM

ఒకసారి శ్రీకృష్ణుడు, అతని సావాసగాళ్ళు ఆలమందల్ని తోలుకొని యమునా తీరంలోని అడవిలోకి వెళ్ళారు. మధ్యాహ్నమయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు....

కాళీయుని పడగలపై బ్రహ్మ కడిగిన పాదం

భాగవతం

ఒకసారి శ్రీకృష్ణుడు, అతని సావాసగాళ్ళు ఆలమందల్ని తోలుకొని యమునా తీరంలోని అడవిలోకి వెళ్ళారు. మధ్యాహ్నమయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ వేడికి తాళలేక, బాగా దాహంగా ఉండడంతో... కృష్ణయ్య మినహా మిగిలినవారందరూ గోవులు, దూడలతో సహా అక్కడ ఉన్న కాళింది మడుగులోకి దిగారు. అందులోని నీరు తనివితీరా తాగారు. వెంటనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణుడు తన వాళ్ళందరూ మరణించడం చూసి తట్టుకోలేకపోయాడు. వారి మీద దయామృత వర్షం కురిపించాడు. దాంతో వారందరూ నిద్రలోంచి లేచినట్టు లేచారు. ఇంతకీ కాళింది మడుగులో నీరు తాగగానే వారందరూ ఎందుకు చనిపోయారు?

ఆమడుగులో కాళీయుడు అనే పెద్ద విష సర్పం ఉంది. అందుకే దానికి కాళింది అనే పేరు వచ్చింది. ఆ సర్పం ప్రతిక్షణం విషం కక్కుతూ... మడుగులోని నీటిని కలుషితం చేస్తూ ఉంటుంది.

ఆ నీరు ఎప్పుడూ కుతకుతా ఉడుకుతూ, పొగలు కక్కుతూ ఉంటుంది. ఆ పొగ పీలిస్తే చాలు... మరణం తప్పదు. ఆ మడుగు మీదుగా ఎగురుతూ వెళ్ళే పక్షులు ఆ పొగను తట్టుకోలేక చనిపోతూ ఉంటాయి. వాటిని కాళీయుడు తింటూ ఉంటాడు.

మడుగులో మాయమైన కన్నయ్య

పునర్జీవితులైన తన స్నేహితులను శ్రీకృష్ణుడు చుట్టూ చేర్చుకొని ‘‘ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో!’’ అంటూ తాను ధరించిన పట్టు పీతాంబరాన్ని పైకి లాగి, నడుముకు బిగించి కట్టుకున్నాడు. సింహంలా కాళిందిలోకి దూకాడు. నవ్వుతూ ఆ నీటిలో ఈదుతున్నాడు. ఇది కాళీయుడు చూశాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లవాడికి? నేను ఉన్న మడుగులో దూకుతాడా!’ అనుకుంటూ... తన పడగలతో కృష్ణుణ్ణి బలంగా చుట్టేసి కాటేశాడు. కృష్ణుడు స్పృహ తప్పినట్టు నటించాడు. అది నటన అని తెలుసుకోలేక గోపబాలురు కలవరపడ్డారు. ‘మన వల్ల కృష్ణయ్యకు ఎంత కష్టం వచ్చింది’ అనుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. పొద్దుపోతున్నా గోవులు, గోవత్సలతో పాటు కృష్ణయ్య, అతని సావాసగాళ్ళు ఇళ్ళకు చేరలేదు. దాంతో వారిని వెతుక్కుంటూ ఊర్లోని జనం బయలుదేరారు. కాళింది మడుగు దగ్గర వారికి ఆలమందలతోపాటు పిల్లలు కనిపించారు. పిల్లలు ఏడుస్తూ ‘‘కృష్ణయ్య కాళింది మడుగులో దూకాడు. దూకి చాలా సేపయింది. ఎంతకీ బయటకు రాలేదు. ఏమైందో ఏమో? మాకు భయంగా ఉంది’’ అంటూ జరిగిన కథంతా చెప్పారు. ఇది విని యశోద తల్లడిల్లింది. ‘‘ఆ సర్పం మా కన్నయ్యను బాధించకుండా విడిచిపెడితే చాలు. మేమందరం దానికి ఆహరం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఆపదలొస్తే ఆదుకోవడానికి కృష్ణయ్య ఉన్నాడు. అతను లేకుండా బతకగలమనే ధైర్యం మాకు లేదు. మేమూ కాళిందిలో దూకి చస్తాం’’ అన్నారు అక్కడున్న జనం. యశోద రెప్పల చాటున పెద్ద ఉప్పెన లేచింది. గుండె నీరైపోయింది. ‘‘నా కన్నయ్య ఎప్పుడు వస్తాడు?’’ అంటూ విలపించింది.


నయన మనోహర నర్తన

ఆమె రోదనను కృష్ణయ్య చూడలేకపోయాడు. ముల్లోకాలనూ బంధించగలిగే జగదేకవీరుడు తల్లి ప్రేమకు కరిగిపోయాడు. పాము పడగల మధ్య బందీగా ఉన్న ఆయన తన శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు. అలా పెరిగిన బృహదాకారాన్ని సర్పం ఎంతోసేపు నిలిపి ఉంచలేకపోయింది. పట్టు సడలింది. కృష్ణయ్య ఒక్క ఎగురు ఎగిరి... కాళీయుని శిరస్సు మీదకు దూకాడు. పిడికిలి బిగించి నెత్తిమీద బలంగా కొట్టాడు. కాళీయుడు విషం కక్కుతూ కింద పడిపోయాడు. కాళీయుడి తోక పట్టుకొని... పడగలమీద కృష్ణుడు గెంతడం మొదలుపెట్టాడు. ఆ సర్పం ఒక్కొక్క పడగ ఎత్తుతూ ఉంటే... కృష్ణయ్య దాన్ని గట్టిగా కిందకు అణగదొక్కుతూ వచ్చాడు. పడగలన్నీ తలలు వాల్చాయి. కృష్ణుడు వాటి మీద నిలబడి నయన మనోహరంగా నాట్యం చేశాడు. యశోద శాంతించింది. కృష్ణయ్య అందెల రవళికి పులకించింది. బ్రహ్మ కడిగిన ఆ పాదాలను ముద్దుగా చూస్తూ... ప్రతిమలా నిలబడింది. బృందావనవాసులందరూ అప్పటివరకూ తాము అనుభవించిన బాధను మరచిపోయారు. కృష్ణయ్యతోపాటు ఆనందతాండవం చేశారు.

సర్పరాజుకు అభయం

కాళీయుడు మరణించాడని తెలియగానే అతని భార్యలందరూ పిల్లలతో సహా వచ్చారు. కృష్ణుణ్ణి చూసి వారు ఆగ్రహిస్తారనుకుంటే, చిత్రంగా... ఒక పక్క రోదిస్తూనే మరోపక్క ఆయన అనుగ్రహం కోసం ప్రార్థన చేశారు ‘‘కృష్ణా! మా భర్త ఎంతటి తపస్సు చేశాడో! ఎన్నెన్ని పుణ్యాలు చేశాడో! మహాత్ములకూ, యోగులకూ కూడా దర్శనం ఇవ్వని నువ్వు... ఈ రోజు అతని శిరస్సు మీద నిలబడి నృత్యం చేస్తున్నావు. పద్మాల లాంటి నీ పాద ముద్రలు పడి... కాళీయుడి శిరస్సు శోభిస్తోంది. నీ పాద ధూళితో అతని జీవితం పునీతమయింది. మా భర్తకు ఎనలేని అనుగ్రహాన్ని ఇచ్చావు. కానీ మేమందరం అనాథలయ్యాం. అనాథనాథుడవని నీకు గొప్ప పేరుంది. మాకు పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నాం’’ అని పదే పదే వేడుకున్నారు. పరంధాముడు కరుణించి... కాళీయుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేశాడు.‘‘అయితే ఒక షరతు. ఇక మీదట నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు నీ స్వస్థలమైన రమణ ద్వీపానికి తిరిగి వెళ్లాలి’’ అని కాళీయుణ్ణి కృష్ణుడు ఆదేశించాడు. ఆ ఆదేశం వినగానే కాళీయుడు గజగజ వణికిపోయాడు.


కాళీయుణ్ణి కబళించాలని గరుత్మంతుడు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి భయపడే కాళీయుడు రమణ ద్వీపాన్ని వదలి... ఆ మడుగులో దాక్కున్నాడు. కాళీయుడి ఆందోళనను గుర్తించిన కృష్ణుడు ‘‘నీ భయం నాకు తెలుసు. గరుత్మంతుడు నిన్ను చంపుతాడని భయపడుతున్నావు. నీకు నేను అభయమిస్తున్నాను. నీ పడగల మీద నా పాదముద్రలు ఉన్నాయి. గరుత్మంతుడు నా సేవకుడు. గొప్ప భక్తుడు. అతను నా వాహనంగా, నా ధ్వజ చిహ్నంగా ఉన్నాడు. నా పాదముద్రలు చూడగానే అతనికి అర్థమవుతుంది... నా దీవెనలు నీకు ఉన్నాయని. సర్పాలు అతనికి ఆహారం అయినప్పటికీ నీ జోలికి రాడు’’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి కాళీయుడు నమస్కరించి, భార్యాపిల్లలతో రమణ ద్వీపానికి తరలివెళ్ళాడు.

నీటిని కలుషితంచేయకండి. వృధా చేయకండి. నీరే అమృతం. నీరే ప్రాణాధారం. నీటిని పాడు చేసినా, వృధా చేసినా భగవంతుడు క్షమించడు

ప్రయాగ రామకృష్ణ

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 05:19 AM