ఆత్మహత్యను ఆపొచ్చు!
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:51 AM
ఆత్మహత్య అనేక అనుమానాలను రేపుతుంది. అంతులేనంత అయోమయానికి లోను చేస్తుంది. అయితే ఆత్మహత్యకు, పరిష్కారం కాని సమస్యలు మాత్రమే కారణాలై ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు స్వల్ప తగాదాలు, అపార్థాలు కూడా ఆత్మహత్యలకు దారితీస్తూ ఉంటాయి.
సమాజం, ఆప్తులు, పరిస్థితులు... ఇలా ఆత్మహత్యతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆత్మహత్యను వ్యక్తిగత అంశంగా కాకుండా ఉమ్మడి సమస్యగా పరిగణించి, ఆత్మహత్య నివారణకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మానసిక నిపుణులు.
అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు. దీర్ఘకాలంలో ఒక కొలిక్కి చేరుకున్న ఆలోచన కావచ్చు. అంతిమంగా ఆత్మీయుల ఆత్మహత్య అనేక అనుమానాలను రేపుతుంది. అంతులేనంత అయోమయానికి లోను చేస్తుంది. అయితే ఆత్మహత్యకు, పరిష్కారం కాని సమస్యలు మాత్రమే కారణాలై ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు స్వల్ప తగాదాలు, అపార్థాలు కూడా ఆత్మహత్యలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకునే వ్యక్తులు కనబరిచే కొన్ని లక్షణాల గురించి అవగాహన పెంచుకోవాలి. అవేంటంటే....
జీవితం వ్యర్థం: ‘నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు’, ‘నేను బ్రతికి ఏం సాధించాలి?’ ఒకరి నోటి వెంట ఈ మాటలు పదే పదే వినిపించినప్పుడు అప్రమత్తం కావాలి.
ఒంటరితనం: కుటుంబసభ్యులు, స్నేహితులకు దూరంగా ఒంటరిగా గడపడం, ఏ పని పట్లా ఆసక్తిని కనబరచకపోవడం...
నిద్ర: అతిగా నిద్రపోవడం, ఏమాత్రం నిద్రపోకుండా ఉండిపోవడం
అనాసక్తి: దేని మీదా ఆసక్తి కనబరచకపోవడం
వీడ్కోలు: ఆప్తులందరికీ పేరుపేరునా వీడ్కోలు సందేశాలు పంపించడం, వ్యక్తిగత వస్తువులను పంచడం
ప్రవర్తన: ప్రమాదకరంగా ప్రవర్తించడం, ప్రాణాలకు విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా నడుచుకోవడం
మాటలు: మరణం, అంతం గురించి మాట్లాడుతూ.. ‘నేను పోతే...’అనే మాటను ఎక్కువగా ఉపయోగించడం...
కుటుంబ చరిత్రలో...
ఆత్మహత్య వంశపారంపర్యం కాకపోయినా, గతంలో కుటుంబంలో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేసినా, ఆత్మహత్యకు పాల్పడినా... ఇతర కుటుంబసభ్యులకు ఆ ముప్పు పెరిగే అవకాశాలున్నాయి. కుటుంబ చరిత్రకు తోడు మానసిక సమస్యలు, దురలవాట్లు, జీవిత సంక్షోభాలు తోడైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆత్మహత్యను సూచించే ఏ మాటలనూ, లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. ఎదుటివాళ్లను బెదిరించడం కోసం అలా అంటున్నారనో, ఏదో ఒక సందర్భంలో అందరూ అలాగే అంటారు అనో.. పట్టించుకోకుండా ఉండిపోకూడదు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడతాడేమోననే అనుమానం ఉన్నా, అతన్ని అడగడానికి వెనకాడే వాళ్లే ఎక్కువ. కానీ నిజానికి ఇలా అడగడం వల్ల, వాళ్ల మనసులోని ఆలోచనను బహిర్గతం చేసే అవకాశం కల్పించిన వాళ్లమవుతాం! వాళ్ల వేదనను అర్థం చేసుకోగలిగామనే సంతృప్తిని అందించిన వాళ్లమవుతాం! అంతిమంగా ఆత్మహత్య ప్రయత్నం కార్యరూపం దాల్చకుండా అడ్డుకున్నవాళ్లమవుతాం!
ఏం చేయాలి?
ఆత్మహత్య చేసుకుంటారనే అనుమానం ఉన్న వ్యక్తులను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. మానసిక వైద్యులను సంప్రతించి, చికిత్స ఇప్పించడంతో పాటు, పరిస్థితి సానుకూలంగా మారే వరకూ సదరు వ్యక్తికి తోడుగా ఉండాలి. స్వీయ హానికి పాల్పడే అవకాశాలు లేకుండా చేయడంతో పాటు అందుకు ఉపయోగపడే వస్తువులు దరిదాపుల్లో లేకుండా చూసుకోవాలి. పరిష్కారాలను సూచించడానికి బదులుగా, మనసులోని బాధను వెళ్లగక్కేలా ఆసరాను అందించాలి. మాటలకు అడ్డుపడకుండా చెప్పేదంతా ఓపిగ్గా వినాలి. వాళ్ల బాధను అర్థం చేసుకున్నామనే భరోసా కల్పించాలి.
డాక్టర్ పి.వి. రాధిక,
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
విజయవాడ.
సెప్టెంబరు 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News