Share News

నెలసరి నొప్పికి పరిష్కారం

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:32 AM

మానసిక, శారీరక అసౌకర్యాలు భరించలేనంతగా ఉంటే, ఉపశమనం కోసం ఆయుర్వేద చిట్కాలను పాటించవచ్చు. అవేంటంటే...

నెలసరి నొప్పికి పరిష్కారం

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నా వయసు 25. ప్రతి నెలసరి ఒక గండంగా మారిపోతోంది. భరించలేని నొప్పి, అసౌకర్యం. ఈ సమస్యకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాన్ని సూచిస్తారా?

ఓ సోదరి, హైదరాబాద్‌

మానసిక, శారీరక అసౌకర్యాలు భరించలేనంతగా ఉంటే, ఉపశమనం కోసం ఆయుర్వేద చిట్కాలను పాటించవచ్చు. అవేంటంటే...

నువ్వుల నూనె మర్దన: ఆయుర్వేద అభ్యంగన స్నానం కోసం ఈ నూనె వాడతారు. దీన్లోని లినోలిక్‌ యాసిడ్‌కు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విషాలను హరించే తత్వం కూడా ఈ నూనెకు ఉంటుంది. కాబట్టి నెలసరి సమయంలో ఈ నూనెతో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.

మెంతుల మహిమ: కాలేయం, మూత్రపిండాలు, మెటబాలిజంకు మెరుగైన ఔషధం మెంతులు. వీటితో నెలసరి నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి 2 టీస్పూన్ల మెంతులను 12 గంటలపాటు నీళ్లలో నానబెట్టి తాగాలి.

వేడి కాపడం: పొత్తికడుపు మీద వేడి కాపడం పెడితే గర్భాశయ కండరాలు ఉపశమనం పొంది నొప్పులు తగ్గుతాయి. కాబట్టి వేడి నీళ్లు నింపిన బాటిల్‌ను పొత్తికడుపు మీద ఉంచి కాపడం పెట్టాలి. వేడి జావ తాగినా, వేడి నీళ్ల స్నానం చేసినా కూడా ఫలితం దక్కుతుంది.

వ్యాయామంతో ఉపశమనం: నొప్పితో మంచానికే అతుక్కుపోయే బదులు, వ్యాయామంతో ఒళ్లు కదిలిస్తే కటి ప్రదేశానికి రక్తప్రసరణ పెరిగి నొప్పులు తగ్గుతాయి. నెలసరి సమయంలో మూత్రాశయ కండరాలు కుంచించుకుపోయేలా చేసే హార్మోన్లను నెమ్మదించేలా చేసే ఎండార్ఫిన్లు వ్యాయామం చేస్తే విడుదలవుతాయి. కాబట్టి ఈ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఆ మూడు రోజులే కాకుండా దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పిస్తే క్రమేపీ నెలసరి నొప్పులు అదుపులోకి వస్తాయి.


శొంఠి, మిరియాల టీ: శొంఠి, మిరియాల పొడి కలిపిన నీళ్లను వేడి చేస్తే హెర్బల్‌ టీ తయారవుతుంది. దీన్లో పాలు కలపకుండా తాగితే, నొప్పులకు కారణమయ్యే హార్మోన్ల పరిమాణం తగ్గి నొప్పులు తగ్గుతాయి. ఈ టీ వల్ల నెలసరి సమస్యలు కూడా సరి అవుతాయి. అలసట కూడా వదులుతుంది.

జీలకర్ర వైద్యం: జీలకర్ర వేసి మరిగించిన నీళ్లు తాగినా ఫలితం ఉంటుంది.

ఛామొమైల్‌ టీ: ఈ పువ్వులు వేసి కాచిన నీళ్లు తాగితే పొత్తికడుపు, నడుము నొప్పులు తగ్గుతాయి. ఈ పూలలోని ఔషధ గుణాలు కూడా గర్భాశయాన్ని కుంచించుకుపోయేలా చేసే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి.

ఫ కప్పు పాలలో, దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు, పసుపు, తేనె, మిరియాల పొడి వేసి వెల్లుల్లి రెబ్బలు ఉడికేవరకూ కాచాలి. ఈ పాలను తాగి, వెల్లుల్లి రెబ్బలను నమిలేయాలి. ఇలా క్రమంతప్పకుండా 3 రోజలు చేసినా నెలసరి నొప్పులు తగ్గుతాయి.

ఈ జాగ్రత్తలు పాటించాలి!

  • భోజనంలో చక్కెర, మైదా, శుద్ధిచేసిన పదార్థాలు, కృత్రిమ రంగులు, రుచులు మానేయాలి.

  • బియ్యం, పాస్టా, బ్రెడ్‌ వాడకం తగ్గించాలి.

  • ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. ఉప్పు శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. దాంతో నెలసరి సమయంలో ఒళ్లు మరింత బరువై బద్ధకం ఆవరిస్తుంది.

  • కాఫీ కూడా బాగా తగ్గించాలి. కెఫీన్‌ వల్ల నెలసరి నొప్పులు ఎక్కువవుతాయి.

  • ప్రతి రోజూ పరగడుపున నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి.

  • నెలసరి ద్వారా పోయే రక్తం ద్వారా క్యాల్షియం శరీరం నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు తప్పక తీసుకోవాలి.

  • రోజుకి కనీసం 8 గంటల నిద్ర తప్పనసరి. నిద్రతో శరీరం ఉపశమనం పొందుతుంది. ఫలితంగా నొప్పులూ అదుపులోకి వస్తాయి.

  • నట్స్‌, సీడ్స్‌ తిని, ఏరోబిక్‌ వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై నొప్పులు తగ్గుతాయి.

డాక్టర్‌ రాంప్రకాశ్‌,

ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 05:32 AM