Share News

పాటగా మారిన ప్రయాణం

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:44 AM

అభిరుచిని ఆకాంక్షగా మలచుకొని, ఖండాంతరాల్లో అభిమానులను సంపాదించుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపిస్తున్నారు మంగ ఈమని. ఆరుపదుల వయసులో ‘ఇండియన్‌ రాగా’ల మ్యూజిక్‌...

పాటగా మారిన ప్రయాణం

అభిరుచిని ఆకాంక్షగా మలచుకొని, ఖండాంతరాల్లో అభిమానులను సంపాదించుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపిస్తున్నారు మంగ ఈమని. ఆరుపదుల వయసులో ‘ఇండియన్‌ రాగా’ల మ్యూజిక్‌ వీడియోలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె ఆలపించిన పాటల్లో కొన్ని ఇరవై లక్షలకు పైగా వీక్షణలతో శ్రోతల మనసులు దోచుకున్నాయి. అంతేకాదు... తన కుమారుడు రూపొందించిన‘జామ్‌ బాయ్‌’తో తెరంగేట్రం చేసి... నటిగానూ ప్రశంసలు పొందారు. యువతరంతో పోటీ పడుతూ...

మసాచుసెట్స్‌ ‘మాస్‌ కల్చరల్‌ కౌన్సిల్‌’ నుంచి ఈ ఏడాది ‘గ్రాంట్స్‌ ఫర్‌ క్రియేటివ్‌ ఇండివిడ్యువల్స్‌’ ప్రోత్సాహకాన్ని అందుకున్న 65 ఏళ్ళ మంగ... తమ తల్లిదండ్రుల ప్రతిభను ప్రోత్సహించేలా ఎందరో ప్రవాస భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘నేను రాజమండ్రిలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు మల్లాది సూర్యనారాయణమూర్తి, అమ్మ మల్లాది సావిత్రి. నాన్నగారు వేదాలు చదువుకున్నారు. ఆయన మాకు క్రమశిక్షణ నేర్పారు. ప్రతి పండుగనూ పిల్లలందరికీ ఒక మంచి జ్ఞాపకంగా మలిచేవారు. అమ్మ రామాయణం, మహాభారతం, భాగవతంలోని కథలు ఎంత బాగా చెప్పేవారంటే, ఆ దృశ్యాలన్నీ మా కళ్ళ ముందు కనిపించేవి. తోబుట్టువులతో ఆటలు, గోదావరి గట్టున తిరగడం, అమ్మతో రేడియో వినడం... నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం పట్ల, కళల పట్ల ఆసక్తి చిన్న వయసులోనే మొదలయింది. అమ్మతో కలిసి ఫిల్టర్‌ కాఫీ తాగుతూ రేడియోలో ‘భక్తిరంజని’ వినడంతో మాకు రోజు ఆరంభమయ్యేది. మా అమ్మ వంట చేసుకుంటూ భాగవత పద్యాలు పాడేవారు. నాకు నచ్చిన పాట రేడియోలో వస్తే గబగబా సాహిత్యం రాసుకునేదాన్ని. ఏదైనా పదం తప్పిపోతే మళ్ళీ ఆ పాట కోసం ఎదురుచూడాల్సిందే. పాట వినడం ఒక ఆనందమైతే, దాన్ని నేర్చుకోవడం మరో ఆనందం. ఇప్పటికీ అదే ఇష్టం. బీఏ పూర్తయ్యాక దగ్గరలోని సంగీత పాఠశాలలో ఆరు నెలలపాటు వీణ, గాత్ర సంగీతం నేర్చుకున్నాను. కుటుంబ వేడుకల్లో, ‘ఆంధ్ర సభ’ కార్యక్రమాల్లో పాడాను. నేను పాడి రికార్డు చేసిన దాదాపు 200 పాటల సేకరణ ఉంది. రోజూ కొత్త పాటలు జోడిస్తూ బంధువులతో పంచుకుంటాను. మా అక్కయ్య కూతురు పార్వతి వాటికోసం గూగుల్‌ డ్రైవ్‌ ఫోల్డర్‌ క్రియేట్‌ చేసి ఇచ్చింది. ఆ విధంగా పాటలు నా దగ్గరే ఉండిపోకుండా అందరికీ చేరుతున్నాయి.


ఆ సందేశాలతో మనసు నిండిపోతుంది...

‘ఇండియన్‌ రాగా’ పేరిట మ్యూజిక్‌ వీడియోలతో నా కొత్త ప్రయాణం మొదలయింది. చిన్నప్పుడు మా అబ్బాయి శ్రీరామ్‌ను నిద్రపుచ్చడానికి ‘లాలీ లాలీ’ పాట పాడేదాన్ని. పెద్దయ్యాక వాడే ’అమ్మా, ఈ పాట రికార్డు చేద్దాం‘ అని ప్రోత్సహించాడు.

యూట్యూబ్‌లో ఆ వీడియో పెడితే దానికి లక్షల్లో వీక్షణలు వచ్చాయి. శ్రోతల నుంచి ‘’మా బాబు మీ పాట వింటేనే నిద్రపోతాడు’’ అనే సందేశాలు అందుకున్నప్పుడు మనసు నిండిపోతుంది. పిల్లలు శ్రద్ధగా వింటున్న, మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న వీడియోలను వీక్షకులు పంపిస్తుంటారు. అవి ఎంత ముద్దుగా ఉంటాయో! ఒకప్పుడు మా ఇంట్లో నా బిడ్డకు పాడిన లాలి పాట.... ఇప్పుడు నేను వెళ్లని దేశాల్లో పిల్లలకు చేరుతోంది. అంతకన్నా ఏం కావాలి? నేను నటిని కావడానికి కూడా మా అబ్బాయే కారణం. తను స్ర్కిప్ట్‌ రాసి, దర్శకత్వం వహించిన ‘జామ్‌ బాయ్‌’ లఘుచిత్రంలో తొలిసారి నటించాను. మ్యూజిక్‌ వీడియోలు చేసినా, నటిగా ఒక పాత్ర పోషించడం కొత్త అనుభవమే. పాట పాడేటప్పుడు మాటల్లోని భావాన్ని అనుభవించడం నాకు అలవాటు. నటనలోనూ అదే ఉపయోగపడింది. కొవిడ్‌ సమయంలో శ్రీరామ్‌కు వీడియో కాల్స్‌ ద్వారా వంటలు నేర్పేదాన్ని. మా అమ్మ దగ్గర నేర్చుకున్న పులిహోర వాడి సినిమాలో భాగమైంది. ఇంట్లో నేను వాడికి వంట నేర్పాను. సెట్‌లో వాడు నాకు నటన నేర్పాడు. ఈ చిత్రంలో మేము తల్లీ కొడుకులుగా నటించాం.

నటిగా నా కొత్త ప్రయాణాన్ని మా బంధువులు, స్నేహితులు ఎంతో ప్రోత్సహించారు. ఇటీవల ‘యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో హాల్‌ నిండా కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నాను. వివిధ సంస్కృతులకు చెందినవారితో మన పులిహోర గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడటం సరదాగా అనిపించింది. సినిమాలో నేను చేసిన తెలుగు స్పైస్‌ ర్యాప్‌ను అందరూ ఆస్వాదిస్తున్నారు.


12-navya.jpg

మన కళలు మనసుతో మాట్లాడతాయి

నేను మొదటిసారి 1987లో అమెరికా వెళ్ళాను. అక్కడ ఏడాదిపాటు ఉండి, తిరిగి భారతదేశానికి వచ్చాను. ఆ తర్వాత మా అబ్బాయి, అమ్మాయి గ్రాడ్యుయేషన్‌ వేడుకలకు వెళ్లాను. ఇప్పుడు సంవత్సరంలో ఎక్కువకాలం శ్రీరామ్‌తో బోస్టన్‌లో ఉంటున్నాను. ఇక్కడ భారతీయ సంగీతం, నృత్యం పట్ల ఆదరణ చాలా ఎక్కువ. ‘ఇండియన్‌ రాగా’ ద్వారా ఎంతోమంది కళాకారులను, ప్రేక్షకులను కలుస్తుంటాను. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ‘డీసీ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో దాదాపు అరవైమందితో పది రోజులు గడిపే అవకాశం వచ్చింది. ఎటు చూసినా పాటలు, నృత్య సాధనలు, కలిసి భోజనాలు... ఒక పెద్ద పెళ్ళి వేడుకలా ఉండేది. అక్కడ పరిచయమైన ఒక సంగీత ఉపాధ్యాయురాలిని అడిగి... ఎనిమిది పాటలు నేర్చుకున్నాను. ఇక్కడ కూడా భారతదేశంలో ఉన్నంత క్రమశిక్షణ, నిబద్ధతతో సాధన చేస్తున్నారు. ఇతర సంస్కృతులకు చెందినవారు సైతం మన కళలను నేర్చుకుంటూ, ప్రోత్సహిస్తున్నారు. మన సంగీతంలోని సంక్లిష్టమైన లయలు, మన కథల్లోని మానవీయ భావాలు, ఆధ్యాత్మికత వారిని ఆకట్టుకుంటున్నాయి. మన కళలు ఎంత పురాతనమైనవైనా... ఈనాటి మనిషి మనసుతో అవి మాట్లాడగలవని నేను నమ్ముతాను.

కొత్త తరాలకు అందించాలని...

ఇటీవల ‘గ్రాంట్స్‌ ఫర్‌ క్రియేటివ్‌ ఇండివిడ్యువల్స్‌’ ప్రోత్సాహకాన్ని అందుకోవడం నాకు దక్కిన అరుదైన గౌరవం. మసాచుసెట్స్‌లో కళాకారులను, సాంస్కృతిక సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేవారిని ప్రోత్సహించడానికి ‘మాస్‌ కల్చరల్‌ కౌన్సిల్‌’ అందించే ఐదువేల డాలర్ల గ్రాంట్‌ అది. కళాకారులు తమ సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఈ సహాయం అందిస్తారు. దానికి ఎంతో పోటీ ఉంటుంది. భారతీయురాలినైన నాకు అది దక్కడం ‘ఇండియన్‌రాగా’ వీడియోల ద్వారా, తెలుగు లలిత సంగీతం ద్వారా నేను చేస్తున్న కృషికి గుర్తింపుగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు నేర్చుకుని, రికార్డు చేసి, కొత్త తరాలకు అందించాలని ఉంది. నటిగా నాకు తెలిసిన జీవితంతోపాటు, నాకు తెలియని ప్రపంచాల్లోకి తీసుకెళ్ళే పాత్రలను ప్రయత్నించాలని ఉంది. వయసు పెరిగిందంటే కొత్త లక్ష్యాలు ఏర్పడకూడదని ఏమీ లేదు కదా! ఇప్పుడు నాకు 65 ఏళ్ళు. కళకు వయసు, భాష, దేశం హద్దులు కావని నిరూపించాలన్నదే నా ఆకాంక్ష.’’

కృష్ణశర్మ


‘శంకరాభరణం’ సినిమా చూసినప్పుడు నా పిల్లలకు తప్పకుండా సంగీతం నేర్పించాలని అనుకున్నాను. వాళ్ళిద్దరూ నేర్చుకుని బాగా పాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా అబ్బాయి శ్రీరామ్‌ స్థాపించిన ‘ఇండియన్‌రాగా’లో ‘లాలి లాలి’, అమ్మ దొంగ, కల్యాణం వైభోగం తదితర గీతాలతో మ్యూజిక్‌ వీడియోలు చేశాను. వాటిలో కొన్నిటికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. చిన్నప్పుడు నేను ఎవరిదో పాట విని నేర్చుకున్నాను. ఇప్పుడు నా పాట విని మరొకరు నేర్చుకుంటున్నారు. అది నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:44 AM