సైకిలెక్కిన ఆశాజ్యోతి!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:46 AM
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి మారుమూల గ్రామాలు, టీ తోటల సరిహద్దుల్లో నాలుగు దశాబ్దాలపాటు ఆరోగ్య వెలుగులు పంచిన సేవామూర్తి గీతా కర్మాకర్. ఆరోగ్య భారత నిర్మాణంలో...
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి మారుమూల గ్రామాలు, టీ తోటల సరిహద్దుల్లో నాలుగు దశాబ్దాలపాటు ఆరోగ్య వెలుగులు పంచిన సేవామూర్తి గీతా కర్మాకర్. ఆరోగ్య భారత నిర్మాణంలో పాలుపంచుకున్న ఆమె.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2026’ అందుకున్నారు. పల్లె ప్రజల గుండెల్లో ‘పోలియో దిదిమొని’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ సేవామూర్తి అలుపెరగని ప్రయాణం ఆమె మాటల్లోనే...
జల్పాయిగురిలోని ఒక చిన్న పల్లెటూరిలో, అత్యంత పేదరికంలో నా బాల్యం గడిచింది. నా తండ్రి జయచంద్ర కర్మాకర్ చేపలు అమ్మి తెచ్చే కొద్దిపాటి రాబడితోనే మా ఇల్లు గడిచేది. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారు. కుటుంబానికి ఆధారమైన నాన్న లేకపోవడంతో మా కష్టాలు రెట్టింపయ్యాయి. పూటగడవడం కూడా గగనంగా మారిన రోజుల్లోనూ అమ్మ ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించింది. నలుగురి కన్నీళ్లు తుడిచే వృత్తి ఎంచుకుంటే నా జీవితానికి ఒక అర్థం ఉంటుందని అమ్మ తరచూ చెప్పేది. అమ్మ ఇచ్చిన ఆ ధైర్యమే నన్ను నర్సింగ్ విద్య వైపు అడుగులు వేసేలా చేసింది.
తొలి సేవా అడుగులు
నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత 1983లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ‘ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్’ (ఏఎన్‌ఎం)గా చేరాను. మొదట బేలాకోబా గ్రామీణ ఆసుపత్రిలో నన్ను నియమించినప్పటికీ , ఆ తర్వాత కొన్ని రోజులకే మారుమూల ప్రాంతమైన దాంగువాఝార్ టీ తోటల సరిహద్దుల్లోకి బదిలీ చేశారు. దాదాపు 23 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ టీ తోటల్లో ఎక్కువ భాగం గిరిజనులే నివసించేవారు. ఆ రోజుల్లో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, తాగునీరు లేదా రహదారి సదుపాయాలు కానీ ఉండేవి కావు. కాన్పులన్నీ ఇళ్లలోనే అపరిశుభ్ర వాతావరణంలో జరిగేవి. నా ఉద్యోగం ప్రారంభించిన తొలి రెండేళ్లపాటు నేను కూర్చోవడానికి కూడా చిన్న భవనం లేదు. దీంతో స్థానిక వారపు సంతల్లోని అంగళ్ల అరుగులపై ఒక బల్ల, కుర్చీ వేసుకుని నా తాత్కాలిక హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించేదాన్ని.
గిరిజనుల ఆశ్రయం
సుదూర పల్లెల్లో ఎవరైనా గర్భిణికి నొప్పులు వస్తే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేవారు. దీంతో నా డ్యూటీ సమయం ముగిసినా శాఖ నుంచి అనుమతులు తీసుకుని సాయంత్రం ఆరేడు గంటల వరకు పల్లెల్లో ఉండిపోయే దానిని. దాంగువాఝార్ టీ తోటల్లో పనిచేసే టీటో అనే గిరిజన మహిళకు తీవ్రంగా రక్తస్రావమై డెలివరీ కష్టంగా మారిన రోజు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. వెంటనే తేయాకు తోట వాచ్‌మన్ ద్వారా సమాచారం పంపి, స్థానిక వైద్యుడి సాయంతో వాహనం ఏర్పాటు చేసి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాను. అక్కడ ఆమెకు సకాలంలో వైద్యం అందడంతో మగబిడ్డ జన్మించాడు.

వైకల్యం ఎదురైనా..
నా సేవలు సజావుగా సాగుతున్న సమయంలో 2008లో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ ప్రమాదంలో నా కాలు విరిగింది. 9 చికిత్సల తర్వాత కూడా నా కాలుకు 40 శాతం వైకల్యం ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇక సైకిల్ తొక్కడం సాధ్యం కాదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ నేను ఇంట్లో కూర్చుంటే పల్లెల్లో ఉన్న గర్భిణులు, పసిపిల్లలకు టీకాలు ఎవరు వేస్తారు? అందుకే నా సొంత జీతం నుంచి రోజుకు రూ. 200 చొప్పున ఖర్చు చేస్తూ ఒక సైకిల్ రిక్షాను అద్దెకు మాట్లాడుకున్నాను. శరీరం సహకరించకపోయినా, విపరీతమైన నొప్పి ఉన్నా రిక్షాలోనే గ్రామాలు తిరుగుతూ నా విధులను కొనసాగించాను.
హెల్త్ సూపర్‌వైజర్‌గా..
నాలుగు దశాబ్దాలపాటు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంగా పనిచేసిన నన్ను జనవరి 2021లో బేలాకోట గ్రామీణ ఆసుపత్రికి హెల్త్‌సూపర్ వైజర్‌గా పంపుతూ పదోన్నతి ఇచ్చారు. ఈ కొత్త బాధ్యతలో దాదాపు 35 వేలమంది జనాభా ఉన్న నాలుగు ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 33మంది ఆశా కార్యకర్తలకు నేను నాయకత్వం వహించాను. మాతాశిశు సంరక్షణతోపాటు పోలియో వ్యాక్సిన్ కోల్డ్‌చైన్ పాయింట్ నిర్వహణ, క్షయ, థలసేమియా, ప్రత్యుత్పత్తి ఆరోగ్య రంగంపై విస్తృత ప్రచార కార్యక్రమాలను సమర్థంగా నిర్వర్తించాను. ఏనాడూ ఒక్క సెలవు కూడా తీసుకోండా, రోగుల రికార్డును పక్కాగా నమోదు చేయడంలో పేరుగాంచిన నేను.. 2026 జనవరి 31న పదవీ విరమణ పొందాను.
అత్యున్నత పురస్కారం
నేను రిటైర్ అయిన కొన్ని రోజులకే ఆరోగ్యశాఖ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు-2026’కు నేను ఎంపికయ్యానని చెప్పారు. అయితే, ఆ సంతోషం ఒక్క రోజు కూడా లేదు. పురస్కారం వార్త వచ్చిన మరుసటి రోజే నా తల్లి కన్నుమూసింది. దేశంలో కేవలం 15 మంది నర్సింగ్ అధికారులకు దక్కిన ఈ గౌరవాన్ని మే 12న నర్సుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు నా హృదయం అమ్మ జ్ఞాపకాలతో, గ్రామీణ ప్రజల ప్రేమాభిమానాలతో నిండిపోయింది.
సేవలోనే శాంతి
మారుమూల గ్రామాల్లో, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా ప్రజారోగ్య రక్షణ కోసం శ్రమిస్తున్న వేలమంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సుల త్యాగాలకు దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని నే ను భావిస్తున్నాను. పేదరికం, శారీరక వైకల్యం, ఆత్మీయుల వియోగం వంటి ఎన్నో కష్టాలు ఎదురైనా సేవ చేయాలన్న సంకల్పం ఉంటే మానవాళికి కావాల్సినంత వెలుగు ఇవ్వవచ్చని నా జీవితం నాకు నేర్పింది.
‘పోలియో దిదిమొని’గా..
ఆసుపత్రులకు రావడానికి భయపడే గిరిజన ప్రజలను కలవడానికి నేనే నేరుగా వారి ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రోజూ నా పాత సైకిల్ వేసుకుని 12 నుంచి 14 కిలోమీటర్లు టీ తోటల మధ్య ఉండే చిన్నచిన్న దారుల్లో... రాళ్లురప్పలు, బురదను దాటుకుంటూ ప్రయాణించేదాన్ని. గర్భిణులను కలవడం, వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం, పోషకాహారం తీసుకోవాలని నచ్చజెప్పడం నా దినచర్యగా మారింది. పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేసేదానిని. పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి నేను స్వయంగా ఊపిరి బిగబట్టి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేదానిని. నా పేరు గీతా కర్మాకర్ అని వారికి తెలియదు. దీంతో అందరూ నన్ను ‘పోలియో దిదిమొని’ (పోలియో అక్క) అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News