Share News

ఈద్‌... ఆధ్యాత్మిక ఆరాధన

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:28 AM

ఇస్లాం ధర్మం అత్యున్నతంగా పరిగణించే ఈద్‌ ఒక ఆధ్యాత్మిక ఆరాధన. అది పవిత్రమైన రంజాన్‌ నెలవంకను చూసిన తరువాత ఆరంభమై... నెల రోజులు కొనసాగుతుంది. రంజాన్‌ నెల ముగిసి, షవ్వాల్‌ నెలవంక...

ఈద్‌... ఆధ్యాత్మిక ఆరాధన

సందేశం

ఇస్లాం ధర్మం అత్యున్నతంగా పరిగణించే ఈద్‌ ఒక ఆధ్యాత్మిక ఆరాధన. అది పవిత్రమైన రంజాన్‌ నెలవంకను చూసిన తరువాత ఆరంభమై... నెల రోజులు కొనసాగుతుంది. రంజాన్‌ నెల ముగిసి, షవ్వాల్‌ నెలవంక కనిపించిన తరువాత... పండుగ (ఈదుల్‌ ఫిత్ర్‌) నమాజ్‌తో ముగుస్తుంది. పండుగ (ఈద్‌) అంటే కరుణామయుడైన అల్లా్‌హకు కృతజ్ఞతలు తెలియజేయడం, ఆయన ప్రసాదించిన వరాలను గుర్తించడం, విశ్వాసులు తమ నమ్మకాలను స్థిరపరుచుకోవడం, ధర్మాన్ని బలపరపరచడం. రంజాన్‌ మాసంలో ఆచరించిన ఉపవాసాలలో ఏవైనా పొరపాట్లు జరిగినట్టయితే... వాటికి పరిహారంగా నిరుపేదలకు జకాతుల్‌ ఫిత్ర్‌ను రంజాన్‌ రోజున కచ్చితంగా చెల్లించాలి. అది పేదలకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. విశ్వాసులలో పరస్పర దయ, సహకార గుణాలను పెంపొందిస్తుంది.

ఈదుల్‌ ఫిత్ర్‌ విధులు: ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినాన ఉదయాన్నే లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఫజ్ర్‌ నమాజ్‌ తప్పనిసరిగా చదవాలి. తలంటు స్నానం చేయాలి. ఉన్నవాటిలో మంచి దుస్తులు ధరించాలి. పరిమళ ద్రవ్యాలు పూసుకోవాలి. కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి. ఈద్‌ నమాజ్‌ కన్నా ముందే జకాత్‌, ఫిత్రా దానాలు చెల్లించాలి. తీపి పదార్థం తినాలి. ఒకటి, మూడు, అయిదు, ఏడు... ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరపు పండ్లు తినాలి. ఈద్గా మైదానానికి వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళాలి, వచ్చేటప్పుడు మరో దారిలో రావాలి. ఈద్‌ నమాజ్‌కు వెళ్ళేటప్పుడు తక్బీర్‌ ప్రార్థనను మెల్లగా పలుకుతూ ముందుకు సాగాలి. కాలి నడకన వెళ్ళడం పుణ్యప్రదం. పండుగ నమాజ్‌ తరువాత తోటివారిని సలామ్‌ చెబుతూ పలకరించాలి. పిల్లలకు ఈదీ (బహుమతి) ఇవ్వాలి. బంధువుల ఇళ్ళకు వెళ్ళి శుభాకాంక్షలు తెలపాలి. ఇరుగుపొరుగువారిని ఇంటికి ఆహ్వానించి తీపి పదార్థాలను అందించాలి. ఆర్తులు ఎవరైనా ఇంటికి వస్తే వారికి తప్పనిసరిగా దానం చేయాలి. పండుగ నమాజ్‌ను ఇరుకైన జనావాసాలలో కాకుండా... విశాలమైన బహిరంగ ప్రదేశాలలో (ఈద్గా మైదానంలో) చేయడం ఉత్తమం. అది దైవప్రవక్త మహమ్మద్‌ సంప్రదాయం. ఈద్గా మైదానం అందుబాటులో లేనప్పుడు... స్థానికంగా ఉన్న పెద్ద మసీదుల్లో ఈద్‌ నమాజ్‌ చేయాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:28 AM