సేవా వారధి... మార్పు సారథి
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:37 AM
ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఒక వైద్య శిబిరానికి వెళితే... క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి ఆమె కంట పడ్డాడు. వైద్య ఖర్చులు భరించలేక అతడికి చికిత్స మధ్యలోనే ఆగిపోయిందని తెలిసి గుండె బరువెక్కింది...
సంకల్పం
ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఒక వైద్య శిబిరానికి వెళితే... క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి ఆమె కంట పడ్డాడు. వైద్య ఖర్చులు భరించలేక అతడికి చికిత్స మధ్యలోనే ఆగిపోయిందని తెలిసి గుండె బరువెక్కింది.
ఆ ఘటన ఆమె ఆలోచనల్ని మార్చేసింది. స్నేహితుల సాయంతో నిధులు సేకరించి... ఆ చిన్నారికి చికిత్స చేయించారు. ప్రభుత్వ కొలువు వదిలేశారు. సేవ బాట పటారు. ఒకే లక్ష్యంతో పని చేసే స్వచ్ఛంద సంస్థలన్నిటినీ ఒకే వేదిక మీదకు తెచ్చారు. ‘సేవా కనెక్ట్’ ద్వారా వేల మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నలభై ఏళ్ల డాక్టర్ ఖుష్బూ తవోరి మోదీ కథ ఇది.
‘‘ఫిబ్రవరి 2024... పదేళ్ల ప్రభుత్వ కొలువుకు స్వస్తి పలికిన సందర్భం. బంధువులు, మిత్రులు... వద్దని అందరూ వారించారు. నా లక్ష్యం వేరైనప్పుడు కొనసాగి ఉపయోగం లేదనిపించింది. అందుకే వదులుకొని బయటకు వచ్చేశాను. మహారాష్ట్ర వార్ధాలోని ఓ మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్న క్రిమినల్ లాయర్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సామాజిక అంశాలపై ఆసక్తి ఉండేది. దాంతో చుట్టూ జరిగేవన్నీ నిశితంగా గమనించేదాన్ని. వార్తా పత్రికలు చదవడం అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే కోపం వచ్చేది. తీసి పక్కన పడేసేవరకు ఊరుకొనేదాన్ని కాదు. వాళ్ల జేబుల్లో నుంచి సిగరెట్ ప్యాకెట్లు తీసి పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పొగ తాగడంవల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి, ఆ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించాను. అలా సామాజిక స్పృహ చిన్న వయసులోనే కలిగింది. అదే ఇవాళ నన్ను ఇటు వైపు నడిపించింది.
లా చదవాలనుకున్నా...
నాన్న స్ఫూర్తితో నేను కూడా న్యాయ శాస్త్రం చదవాలనుకున్నాను. కానీ అమ్మానాన్న సూచనతో వైద్య రంగాన్ని ఎంచుకున్నాను. నాగపూర్ ‘ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చదివాను. 2013లో ముంబయి ‘టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజీ’ నుంచి కమ్యూనిటీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేశాను. ఆ సమయంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాను. అప్పుడు అర్థమైంది... పేదరికం, విద్య, జీవనోపాధి, సామాజిక మద్దతు తదితర అంశాలతో ఆరోగ్యమనేది ఎంతలా ముడిపడివుందని. నేను ఏ దారి ఎంచుకున్నా అందరికీ ఆరోగ్యం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా.
వ్యవస్థను బలోపేతం చేసి...
2014లో క్లాస్ వన్ మెడికల్ ఆఫీసర్‌గా థానే మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత పదేళ్ల పాటు స్కూల్ హెల్త్ ఆఫీసర్, సిటీ టీబీ ఆఫీసర్, కొవిడ్-19 ఇన్చార్జిగా వివిధ హోదాల్లో పని చేశాను. ఇందులో భాగంగా వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణ, శిక్షణ, పరిపాలన సంబంధిత బాధ్యతలు నిర్వర్తించాను. సీఎస్ఆర్ భాగస్వామ్యంతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయవచ్చని తెలుసుకున్నాను. అలా కొంతకాలానికి నా పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చాను. కరోనా సమయంలో నేను తీసుకువచ్చిన కొన్ని విధానాలు తరువాతి కాలంలో వ్యవస్థకు పునాదులుగా మారాయి. అందుకు గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు, ప్రశంసలు అందాయి. అప్పుడు నాకు అర్థమైంది... ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన విధానం తీసుకువస్తే అది లక్షలమంది జీవితాలను ప్రభావితం చేయగలదని.
ఉద్యోగం వదిలేసి...
నేను వృత్తిపరంగా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... స్వచ్ఛంద సంస్థలతో నా అనుబంధం కొనసాగిస్తూనే వచ్చాను. సమయం దొరికినప్పుడల్లా ఆ సంస్థలకు వెళ్లి, వారితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. వైద్యపరంగా నేను చేయగలిగిన సాయం చేసేదాన్ని. ఈ క్రమంలో నాకు ఒకటి బోధపడింది. పేదరికంలో మగ్గుతూ కనీస అవసరాలు తీరక అవస్థలు పడుతున్నవారు ఎందరో. కానీ చేయూతనిచ్చేవారు ఎవరో వారికి తెలియదు. అలాగే చాలా కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు అభాగ్యులను ఆదుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఉంటుంది. కానీ నిజమైన లబ్ధిదారుణ్ణి చేరలేక ఆ లక్ష్యం అటకెక్కుతోంది. ఈ అంతరం పోవాలంటే ఇద్దరికీ మధ్యన ఒక వారధి కావాలి. అది నేనే కావాలని నిర్ణయించుకున్నాను. అలాగని ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే దీనిపై దృష్టి పెడితే దానికి అర్థం లేదనిపించింది. అందుకే 2024లో నా పదేళ్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాను. ఆ అనుభవమే పెట్టుబడిగా ‘సేవా కనెక్ట్’ పేరుతో ఒక వేదిక ప్రారంభించాను.
పరిశోధన... పర్యటన...
‘సేవా కనెక్ట్’ ఏర్పాటు తరువాత ఈ రంగంలో అనేకమంది అనుభవజ్ఞులను కలిశాను. ఎన్జీవోల ప్రతినిధులతో మాట్లాడాను. వివిధ నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడలకు వెళ్లి వారి జీవితాలను అధ్యయనం చేశాను. అన్నిటినీ క్రోడీకరించి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు రూపొందించాను. తొలుత ఫేస్బుక్ ద్వారా, తరువాత వెబ్సైట్ రూపొందించి ఇరు వర్గాలకూ చేరువ అయ్యేందుకు ప్రయత్నించాను. అనుకున్నదాని కంటే తక్కువ సమయంలోనే... అటు ఆపన్నులను, ఇటు సేవా దృక్పథం ఉన్నవారిని కలపగలిగాను. ఇప్పటివరకు వందకు పైగా స్వచ్ఛంద సంస్థలను, అదే సంఖ్యంలో కార్పొరేట్ సంస్థలను మా ప్లాట్‌ఫామ్ కిందకు తీసుకురాగలిగాను. వివిధ మాధ్యమాల ద్వారా కొన్ని ఎన్జీవోలకు కావాల్సిన ఫండింగ్, వాలంటీర్లను కూడా సమకూర్చగలిగాను. తద్వారా వేలమంది పేదల జీవితాలకు భరోసా కల్పించాను.’’
ఒక ఉద్యమంలా...
‘‘పొగాకు వ్యతిరేక పోరాటాన్ని కూడా నేను కొనసాగిస్తున్నాను. చిన్నతనంలో ఆరంభమైన ఈ ఉద్యమం ద్వారా నేటికి 70 వేల మందికి పైగా యువతను కలిశాను. వారిలో చాలామందిని సిగరెట్ లాంటి దురలవాట్లకు దూరం చేయడంలో విజయం సాధించాను. ఇవేకాదు... వ్యర్థాల నిర్వహణపై, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్నాను. ఇందుకోసం పలు వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ రేపు నేను ఉన్నా లేకపోయినా వాటంత అవి ఆటంకాలు లేకుండా సాగిపోవాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను. ఉన్నతాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం వదిలేస్తానని చెప్పినప్పుడు సన్నిహితులు, స్నేహితులు వద్దని వారించారు. కానీ నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా నిర్ణయానికి కట్టుబడి లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఇవాళ అది అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఒక మహిళగా, ఒక మానవత్వం గల మనిషిగా సమాజంలో ఎంతో కొంత మార్పు తేగలిగాను. అందుకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది.’’
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News