Share News

దేవుని ప్రేమ అందరిదీ!

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:06 AM

ఏసు క్రీస్తును దర్శించడానికి, ఆయన బోధలు వినడానికి ఎంతోమంది వచ్చేవారు. వారిలో అన్ని రకాలవారూ ఉండేవారు. దాంతో పాపులను ఏసు చేరదీస్తున్నాడని పరిసయ్యులు...

దేవుని ప్రేమ అందరిదీ!

దైవమార్గం

ఏసు క్రీస్తును దర్శించడానికి, ఆయన బోధలు వినడానికి ఎంతోమంది వచ్చేవారు. వారిలో అన్ని రకాలవారూ ఉండేవారు. దాంతో పాపులను ఏసు చేరదీస్తున్నాడని పరిసయ్యులు తదితరులు ఆయనను ఆక్షేపించేవారు. దానికి సమాధానంగా... ఆయన వరుసగా చెప్పిన ఒకే విధమైన మూడు ఉపమానాలు లూకా 15వ అధ్యాయంలో కనిపిస్తాయి. తప్పిపోయిన కుమారుడు, గొర్రె కథలతో పాటు ఒక స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణెం కథ కూడా వాటిలో ఒకటి. ‘‘ఒక మహిళ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయి. వాటిలో ఒక నాణేన్ని ఆమె పోగొట్టుకున్నట్టయితే... ఆమె దీపాన్ని వెలిగిస్తుంది. ఇల్లు ఊడుస్తుంది. ఆ నాణెం దొరికేవరకూ జాగ్రత్తగా వెతుకుతుంది. అది దొరికినప్పుడు... తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి ‘‘నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది’’ అని వారితో సంతోషంగా చెబుతుంది. మారుమనసు పొందిన పాపి విషయంలో... దేవదూతల సమక్షంలో అలాంటి సంతోషమే కలుగుతుంది’’ అని ఏసు చెప్పాడు.

దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఎంతో విలువైనవాడు.. ఒక నాణేన్ని పోగొట్టుకున్న మహిళ దగ్గర ఇంకా తొమ్మిది నాణేలు ఉన్నాయి. కానీ పోయిన నాణెంకోసం ఆమె ఇల్లంతా వెతికింది. అలాగే లోకంలో ఎందరు ఉన్నా... ప్రతి ఒక్కరినీ దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అందరిదీ. ఎవరూ నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. చీకటిగా ఉన్న ఇంట్లో నాణెం వెతకడానికి ఆమె దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. నాణెం దొరికేదాకా శ్రమపడింది. ఇది మానవులను రక్షించడానికి దేవుడు చూపే పట్టుదలను, ఆసక్తిని సూచిస్తుంది. నాణెం దొరికినందుకు ఆ మహిళ తన సన్నిహితులతో సంతోషాన్ని పంచుకున్నట్టే... పాపి తన తప్పును తెలుసుకొని, తన మనసు మార్చుకోవడం ఇతర విశ్వాసులకు, దైవానికి సంతోషకరం అవుతుంది. ఇక.. ఆ మహిళ నిర్లక్ష్యం కారణంగా ఆమె ఇంట్లోనే నాణెం పొయింది. కొన్నిసార్లు నిర్లక్ష్యం కారణంగానో, లేదా చుట్టుపక్కల పరిస్థితుల వల్లనో సత్యానికి మనుషులు దూరమవుతారు. వారిని తిరిగి చేర్చుకోవడం సంఘం బాధ్యత అని కూడా ఇది సూచిస్తోంది.


మరింత లోతుగా పరిశీలించినట్టయితే... ఆ మహిళను సంఘానికి లేదా పరిశుద్ధాత్మకు చిహ్నంగా పరిగణించవచ్చు. దేవుని వాక్యానికి, సంఘానికి దూరమైన వారిని వెతికే పవిత్రమైన కార్యాలకు ఆమె ప్రతీక. చీకటిగా ఉన్న గదిలో... పోయిన వస్తువు కనిపించాలంటే వెలుగు కావాలి. దేవుని వాక్యాన్ని దీపంతో బైబిల్‌ పోల్చింది. అంటే చీకటిలో ఉన్న మనిషికి సత్యాన్ని చూపించడానికి దేవుని వాక్యం అనే వెలుగు అవసరం. నేల మీద చెత్త, దుమ్ము పేరుకుపోయినప్పుడు నాణెం కనిపించదు. ఇల్లు ఊడ్చడం అంటే... మనిషి హృదయంలో పాపపు మలినాల్ని తొలగించడాన్ని, తప్పిపోయినవారిని తిరిగి చేర్చుకోడానికి సంఘం శ్రద్ధను, నిరంతర ప్రయత్నాన్ని తెలియజేస్తుంది. నాణెం మట్టిలో పడినా దాని విలువ తగ్గదు. అలాగే... మనిషి పాపపు దారిలో పడినా... దేవుని దృష్టిలో అతని ఆత్మకు ఉండే విలువ ఎన్నటికీ తగ్గదు.

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 02:06 AM