నీటి బుగ్గలో కొలువైన గంగాధరుడు
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:15 AM
సాధారణంగా ఆలయాల్లో దేవతామూర్తులు గర్భగుడిలో ప్రతిష్ఠితులై... భక్తులకు దర్శనమిస్తారు. అయితే గంగాధరుడైన పరమశివుడు... పార్వతీసమేతుడై...
ఆలయదర్శనం
సాధారణంగా ఆలయాల్లో దేవతామూర్తులు గర్భగుడిలో ప్రతిష్ఠితులై... భక్తులకు దర్శనమిస్తారు. అయితే గంగాధరుడైన పరమశివుడు... పార్వతీసమేతుడై అటవీ ప్రాంతంలోని జలప్రవాహంలో కొలువుతీరిన ప్రదేశం... బుగ్గ క్షేత్రం. ప్రతి సంవత్సరం కార్తిక మాసం కృష్ణ పక్షంలో అక్కడ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలోని పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరిస్తే... కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్రతోపాటు స్థలపురాణం రీత్యా పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది. ఇది అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటని, ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా కొలువయ్యాడనీ ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలిసినందున స్వామికి ‘బుగ్గరామలింగేశ్వరుడు’ అనే పేరు వచ్చింది. అడవిలోంచి వచ్చే ఈ ప్రవాహం ‘శివుణ్ణి అభిషేకించడానికే పుట్టిందా!’ అన్నట్టు తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. తిరిగి సమీప అడవుల్లోకి వెళ్ళి అదృశ్యమవుతుంది. కాగా... బ్రాహ్మణుడైన రావణుణ్ణి సంహరించిన తరువాత... బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి కోసం శ్రీరాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్ఠాపన చేశాడనీ, వాటిలో ఇదీ ఒకటనీ స్థల పురాణం పేర్కొంటోంది. ఆ సమయంలో రాముడు తన బాణాన్ని భూమిలోకి సంధించి గంగను పైకి రప్పించి శివలింగాన్ని ఆ నీటితో అభిషేకించి పూజలు చేశాడట. అందుకే ఈ పుణ్య తీర్థానికి ‘బుగ్గరామలింగేశ్వర క్షేత్రం’ అని పేరు వచ్చిందని చెబుతారు ప్రతి సంవత్సరం కార్తిక పౌర్ణమి మొదలుకొని అమావాస్య దాకా 15 రోజులపాటు బుగ్గరామలింగేశ్వరుడి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. సమీప ప్రాంతాలనుంచే కాకుండా... పలు జిల్లాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో తరలి వస్తారు. ఉపవాసాలు ఉండి... వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తిక దీపారాధన, యాగాలు, తులసీ పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల మొదలైన ఈ ఉత్సవాలు డిసెంబర్ ఎనిమిది వరకూ కొనసాగుతాయి.
ఎలా వెళ్ళాలి?:
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో.. అటవీప్రాంతంలో శ్రీ బుగ్గరామలింగేశ్వర క్షేత్రం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ రహదారిలో ఉన్న ఇబ్రహీంపట్నానికి, అక్కడి నుండి మంచాల, ఆరుట్ల మీదుగా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకుంటారు. హైదరాబాద్-విజయవాడ రహదారిలో తూప్రాన్‌పేట్ గేట్, చౌటుప్పల్-కొయ్యలగూడెం గేటు నుంచి నేరుగా ఈ క్షేత్రానికి చేరే మార్గాలు ఉన్నాయి.
ఎల్. మధుసూదన్‌రెడ్డి,
మంచాల
ప్రభుత్వ గెజిట్‌లో ప్రస్తావన
1961 నాటి భారత జనగణన గెజిట్‌లో బుగ్గ క్షేత్రం వివరాలు నమోదయ్యాయి. సెన్సెస్ ఆఫ్ ఇండియా- హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గెజిటియర్‌లోని ‘ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్’ విభాగం 88వ పేజీలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఉత్సవాల ప్రస్థావన ఉంది. అప్పటికే ఈ ఉత్సవ సంప్రదాయం 150 ఏళ్ళకు పైగా కొనసాగుతున్నట్టు అందులో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ జాతరకు రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా జరిగే ఉత్సవాలకు సుదూర ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యేవారని గెజిటియర్‌లో నమోదు చేశారు. బుగ్గ నీటిలో స్నానాలు, ఉపవాసాలు, జాగరణలు చేయడంతో పాటు కొబ్బరికాయలు, బెల్లం, గుమ్మడికాయలు సమర్పించడం లాంటి మొక్కుల సంప్రదాయాలను కూడా అందులో వివరించారు. ఆరుట్ల గ్రామానికి సుమారు రెండున్నర మైళ్ల దూరంలో ఏడాది పొడవునా నీరు ఉబికి వచ్చే జలధార, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నట్టు గెజిట్‌లో పేర్కొన్నారు. ఉత్సవాలకు ఆనాటి ప్రధాన పోషకుడిగా సి.ఎం.మాసయ్య పేరును, వారసత్వంగా పూజలు నిర్వహించే అర్చకుడిగా పేరూరి శేషాచారి వివరాలను కూడా పొందుపరిచారు. ఈ వివరాలు క్షేత్ర ప్రాచీనతను, బుగ్గ జాతరకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News