డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు.. దేశంలోనే అత్యధిక సంపన్న సీఎం
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:07 PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు.
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి విలువను సైతం ఆయన అధిగమించినట్టు భారత ఎన్నికల కమిషన్ వద్ద దాఖలైన ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా తెలుస్తోంది.
కాగా, అఫిడవిట్ల ఆధారంగా డీకే శివకుమార్ తర్వాత సంపన్న ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూ.648 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఆస్తుల విలువను రూ.30 కోట్లుగా డిక్లేర్ చేశారు. దక్షిణాది ముఖ్యమంత్రుల్లో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.6.6 కోట్లు.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) చేపట్టిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రకారం, హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలైన బిహార్, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలోని 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి విలువ రూ.106.75 కోట్లు ఉంది. అంటే ఈ 10 రాష్ట్రాల సీఎంల కంటే శివకుమార్ 13 రెట్లు సంపన్నుడని చెప్పుకోవచ్చు.
గత ఏడాది ఆగస్టులో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చింది. డీకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను ముందుకు తీసుకువెళ్లారు. బెంగళూరు సౌత్ జిల్లాలోని కనకపుర నియోజకవర్గానికి డీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పేరు మార్పు తర్వాత జిల్లాలో భూముల ధరలు పెరుగుతాయని కూడా డీకే భరోసా ఇచ్చారు. డీకే శివకుమార్‌కు ఈ జిల్లాలో రూ.10.37 కోట్ల విలువైన 71 ఎకరాలు ఉన్నాయి. శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు రూ.93.97 ఎకరాల వ్యవసాయ, ఇతర ఆస్తులు ఉన్నాయి. వాటి విలువను రూ.8.35 కోట్లుగా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, రామనగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చిన తర్వాత ఇక్కడి భూముల విలువ రెట్టింపు నుంచి మూడు రెట్లు పెరిగినట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
టీఎంసీలో తిరుగుబాటు.. 59 మంది ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్‌కు లేఖ