Share News

టీఎంసీలో తిరుగుబాటు.. 59 మంది ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్‌కు లేఖ

ABN , Publish Date - Jun 03 , 2026 | 03:10 PM

పశ్చిమబెంగాల్‌లోని విపక్ష తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు 59 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణ గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు బుధవారంనాడు అందజేశారు.

టీఎంసీలో తిరుగుబాటు.. 59 మంది ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్‌కు లేఖ
TMC rebel MLAs submit letter to Speaker

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు 59 మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణ గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు బుధవారంనాడు అందజేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని, డిప్యూటీ లీడర్లుగా సెయిలీ సాహా, అహ్మద్ ఖాన్‌ పేర్లను ఈ లేఖలో ప్రతిపాదించారు.


దీనికి ముందు టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తమ బలం చాటుకునేందుకు వారంతా కలిసికట్టుగా వచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలకు రితబ్రత నాయకత్వం వహిస్తున్నారు. కాగా, లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో రితబ్రత బెనర్జీ (ఉలుబేరియా పూర్బ), సందీపన్ సహా (ఎంటల్లీ), సబీనా యాస్మిన్ (సుజాపూర్), చంద్రనాథ్ సిన్హా (బోల్పూర్), నియామత్ షేక్ (హరిహర్‌పార), సెయిలీ సాహా (కేశ్‌పూర్), తపస్ మైతీ (దోమ్‌జూర్), అరూప్ రాయ్ (హౌరా మధ్య), ఎండీ గులామ్ రబ్బాని (గోల్పోఖర్), ఉషారాణి మోండల్ (మినాఖాన్), ప్రియాల్ పాల్ (సంక్రయిల్), గుల్షన్ ముల్లిక్ (పాంచ్లా), రతిన్ ఘోష్ (మధ్యంగ్రామ్), సుభాశిష్ దాస్ (మహేష్‌తాల), ముస్పాఫిజుర్ రెహమాన్ (భరత్‌పూర్), అఖ్రుజ్జామన్ (రఘనాథ్‌గంజ్), సమీర్ ముఖర్జీ (రతువా), ప్రసూన్ బెనర్జీ (చంచల్) ఉన్నారు.


మరోవైపు, 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ పార్టీ నుంచి సస్పెండయిన రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేసుకోవడం, సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందజేయడంపై మమతా బెనర్జీ అధికారింగా ఇంకా స్పందించలేదు. అయితే పార్టీ లెజిస్లేటివ్ విభాగం కీలక నియామకాల వివరాలను టీఎంసీ సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్‌కు తెలియజేశారు. శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్‌ను అసెంబ్లీలో విపక్ష నేతగా, ఆషిమా పాత్ర, నయన బందోపాధ్యాయ్ డిప్యూటీ లీడర్లుగా, చీఫ్ విప్‌గా ఫర్హద్ హకీమ్‌ను పార్టీ నియమించినట్టు తెలియజేశారు.


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అభియోగంపై ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సహాలను పార్టీ నుంచి ఇటీవల టీఎంసీ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో తమదే అసలైన టీఎంసీ అంటూ రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు లేఖ అందజేయడం సంచలనమవుతోంది. టీఎంసీకి 80 మంది శాసనసభ్యులు ఉండగా వీరిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది మద్దతు ఉంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై వేటుపడదు. ఆ ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు వర్గంలో 53 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఉండాలి. అయితే తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రితబ్రత బెనర్జీ పేర్కొనడం, స్పీకర్‌ను కలిసి లేఖ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Updated Date - Jun 03 , 2026 | 03:42 PM