ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్
ABN , Publish Date - Feb 27 , 2026 | 01:03 PM
దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ ఘటనలో విద్యార్థి సంఘం ప్రస్తుత, మాజీ అధ్యక్షులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. గురువారం సాయంత్రం విద్యార్థి సంఘం మార్చ్ నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కళాశాల గేటు వద్ద ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం.. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సహా ప్రస్తుత అధ్యక్షురాలు అదితి మిశ్రాలు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్ గోపికా బాబు, జాయింట్ సెక్రటరీ దానిష్ అలీ, పలువురు ప్రముఖ విద్యార్థి నాయకులూ ఉన్నారు. ఈ ఘటనపై వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసులు దాడి చేయడంతోనే విద్యార్థులకు గాయాలయ్యాయయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన పోలీసులు.. విదార్థులంతా మూకుమ్మడిగా తమపై ఘర్షణకు దిగారని ప్రత్యారోపణలు చేశారు. కర్రలు, బూట్లు విసరడం సహా భౌతికంగా తమపై దాడికి దిగారని.. ఫలితంగా సుమారు 25 మంది సిబ్బంది గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. క్యాంపస్ వెలుపల మోహరించిన ఓ జవాన్‌పై.. విద్యార్థులు భద్రతా సిబ్బందిని దుర్భాషలాడుతూ, కర్రలు విసిరారన్నారు. ఈ నేపథ్యంలో నిరసనల్ని అదుపు చేయడంలో భాగంగా.. ప్రస్తుతం జేఎన్ యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
కవాతు ఎందుకంటే?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనల అమలు, జేఎన్ యూఎస్ యూ ఆఫీస్ బేరర్ల తొలగింపు, ప్రతిపాదిత రోహిత్ చట్టంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థి సంఘం మార్చ్ చేపట్టింది. జేఎన్‌యూ క్యాంపస్ నుంచి విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు సుదీర్ఘ కవాతు నిర్వహించేందుకు విద్యార్థులు పిలుపునిచ్చారు. అయితే.. ఈ నిరసనలకు వారు ఎలాంటి అనుమతి పొందలేదని పోలీస్ అధికారులు చెప్పారు. అందువల్లే వారిని యూనివర్సిటీ ప్రాంగణం వరకే శాంతియుతంగా నిరసన ప్రదర్శనలను పరిమితం చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు.
పోలీసుల చర్యలు..
అయినప్పటికీ.. సుమారు 400-500 మంది విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడి నిరసనలు చేపట్టారని పోలీసులు అన్నారు. మధ్యాహ్నం వేళ నిరసనకారులు మెయిన్ గేట్ ద్వారా బయటకు వెళ్లి మంత్రిత్వ శాఖవైపు వెళ్లేందుకు యత్నించారని చెప్పారు. 'పరిస్థితి తీవ్రమవడంతో క్యాంపస్ వెలుపల ఏర్పాటు చేసిన బారికేడ్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు బ్యానర్లు, కర్రలు, బూట్లు విసిరడం సహా భౌతిక దాడికి పాల్పడ్డారు. మరికొందరు పోలీస్ సిబ్బందిని కరిచారు. ఫలితంగా అనేక మంది పోలీసులు గాయపడ్డారు' అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు.. విద్యార్థులపై బీఎన్ఎస్ సెక్షన్లు 221(ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 121(1) (విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని గాయపరచడం), 132 , 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం