వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:50 PM
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శాంతి, భద్రత విభాగాన్ని సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శాంతి, భద్రత విభాగాన్ని సమాచార హక్కు చట్టం (RTI) పరిధి నుంచి మినహాయిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను రద్దు చేసింది (Tamil Nadu RTI order).
పబ్లిక్ (లా అండ్ ఆర్డర్) విభాగాన్ని ఆర్టీఐ చట్టం పరిధి నుంచి మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 21, 2026న నిర్ణయించింది. ఈ మేరకు విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వం గెజిట్‌లో ఈ ఉత్తర్వులను ప్రచురించింది. పబ్లిక్ లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలో పోలీసుల కాల్పులపై విచారణ నివేదికలు, కస్టడీ మరణాలు, పోలీసుల చిత్రహింసలు, రిమాండ్ ఖైదీల మరణాలు, సామాజిక ఘర్షణలు, భద్రతకు సంబంధించిన నిర్బంధ కేసులు వంటి అంశాలు ఉంటాయి (Vijay TVK government).
ఆ ఉత్తర్వు ద్వారా ప్రజా శాంతి, భద్రతకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపై సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా పొందే అవకాశం పరిమితం అవుతుందనే చర్చ మొదలైంది (RTI exemption). తాజా ఉత్తర్వులపై రాజకీయ పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం వాటిని పునఃపరిశీలించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇవీ చదవండి:
శాంతిని కోరుకున్నామంటే బలహీనమని కాదు: రాజ్‌నాథ్ సింగ్
ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..