Share News

విజయ్‌ను చూసి వైకో ఇంట్లో మహిళా సిబ్బంది ఉద్వేగం.. వీడియో వైరల్

ABN , Publish Date - May 11 , 2026 | 09:30 PM

సాధారణ స్థాయి నుంచి వచ్చానంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం నుంచి నిరాడంబరతను చాటుకుంటున్న విజయ్ వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చెన్నైలోని ఎండీఎంకే చీఫ్ వైకోను మంగళవారంనాడు ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కలుసుకున్నారు.

విజయ్‌ను చూసి వైకో ఇంట్లో మహిళా సిబ్బంది ఉద్వేగం.. వీడియో వైరల్
Vijay at Vaiko residence in Chennai

చెన్నై: సాధారణ స్థాయి నుంచి వచ్చానంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం నుంచి నిరాడంబరతను చాటుకుంటున్న విజయ్ వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చెన్నైలోని ఎండీఎంకే చీఫ్ వైకో (Vaiko)ను సోమవారంనాడు ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఫోటోలు దిగారు. అనంతరం వైకో ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిని సైతం ఆత్మీయంగా పలుకరించడంతో వారు ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ నిరాడంబరతకు ఇది నిదర్శనమంటూ ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


వైకో ఇంటికి వచ్చిన విజయ్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం తన ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిని పరిచయం చేస్తూ, వీరంతా విజయ్‌కు పెద్ద అభిమానులనీ, విజిల్ గుర్తుకే ఓటు వేశారని చెప్పడంతో అక్కడ అహ్లాద వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడిని అంత దగ్గరగా చూడటంతో వారు ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ సైతం ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. విజయ్ సాధారణ వ్యక్తిత్వం, నిరాడంబరతకు ఇది నిదర్శనమంటూ నెటిజెన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


నేను వైకో అభిమానిని..

వైకో పట్ల విజయ్ సైతం తన అభిమానాన్ని చాటుకున్నారు. వైకో ప్రసంగాలు, రాజకీయ సామర్థ్యాన్ని ప్రశంసించారు. 'నేను మీ అభిమానిని' అంటూ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తొలి రాజకీయ ప్రసంగం విక్రవాండిలో చేశానని, ఆ ప్రసంగానికి ముందు తాను వైకో ప్రసంగాలను పదేపదే చూశానని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 11 , 2026 | 10:02 PM