Share News

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

ABN , Publish Date - May 11 , 2026 | 06:55 PM

కేరళం అసెంబ్లీ ఫలితాల్లో యూడీఎఫ్ ఘనవిజయం సాధించి వారం రోజులైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆ పదవి మినహా తనకు ఏ పదవీ అక్కర్లేదని తేల్చిచెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్
VD Satheesan and Rahul Gandhi

తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఫలితాల్లో యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించి వారం రోజులైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ (VD Satheesan) ఆ పదవి మినహా తనకు ఏ పదవీ అక్కర్లేదని తేల్చిచెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సతీశన్ ఆలోచన, పార్టీ అధిష్టానం మదిలో ఉన్న ఆలోచన ఒకటే కాకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోందని ఆ వర్గాలు చెబుతున్నాయి.


కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ వైపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు రాహుల్ గాంధీ మొగ్గుచూపుతున్నారని, వేణుగోపాల్ నాయకత్వంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో సతీశన్‌కు కీలక మంత్రి పదవి అప్పగించాలని కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న రమేష్ చెన్నితాలను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించాలని పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. అయితే ప్రజలు సతీశన్‌ను సీఎంగా కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. యూడీఎఫ్ భాగస్వామి అయిన ఐయూఎంఎల్ సైతం సతీశన్‌కు మద్దతు తెలుపుతోంది. ఆయనకు ప్రభుత్వంలో రెండవ కీలక బాధ్యత అప్పగించడం తమకు ఆమోదయోగ్యం కాదని చెబుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో పడినట్టు చెబుతున్నారు.


రాహుల్ గాంధీ సమావేశం

లెజిస్లేటివ్ పార్టీలో మెజారిటీ అభిప్రాయాన్ని కాదనడం ఏ పార్టీకి అంత సులువు కాదు. ఇదే సమయంలో భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను బేఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. కేరళం కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో రాహుల్‌గాంధీ మంగళవారంనాడు సమావేశం ఏర్పాటు చేశారు.


ఒత్తిడి వ్యూహాలపై కాంగ్రెస్ అసంతృప్తి

కాగా, సతీశన్, చెన్నితాల వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి వ్యూహాలపై కాంగ్రెస్ ఇప్పటికే అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయాల వద్ద వేణుగోపాల్ కటౌట్లు వెలిసాయి. సతీశన్ విధేయులు సైతం బలప్రదర్శనలకు దిగుతున్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై పోరాటాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న సతీశన్ అసంతృప్తి చెందితే పార్టీకి డ్యామేజ్ జరగవచ్చని, కర్ణాటకలో అధికార పోరును ఎదుర్కొంటున్న తమకు ఇది మరో తలనొప్పి కావచ్చని అధిష్టానం భావిస్తున్నట్టు చెబుతున్నారు. అదీకాక, వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తే ఆయన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. తదునుగుణంగా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉండటంతో ఆ సీటుకు కూడా ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఆ రకంగా పార్టీ వరుస ఎన్నికలు ఎదుర్కోవలసి వస్తుంది.


కాగా, సీఎం పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంలో అధిష్టానం అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఇందుకు సమయం పడుతుందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఆలస్యం వల్ల వచ్చే నష్టమేమీ లేదని విశ్లేషించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి మే 23వ తేదీ వరకూ గడువు ఉందనీ, ఈలోపు సీఎం ఎవరనే డైలమా తొలగే అవకాశం ఉందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేలో అసమ్మతి.. పళనిస్వామి నాయకత్వంపై గుర్రుమంటున్న నేతలు

పశ్చిమాసియా సెగ: రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్.. ఇంధన భద్రతపై కీలక భేటీ

Updated Date - May 11 , 2026 | 08:50 PM