అన్నాడీఎంకేలో అసమ్మతి.. పళనిస్వామి నాయకత్వంపై గుర్రుమంటున్న నేతలు
ABN , Publish Date - May 11 , 2026 | 05:28 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) నిరాశాపూరిత ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు జరగాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) నిరాశాపూరిత ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నాయకత్వ మార్పు జరగాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తన పదవికి రాజీనామా చేయాలని పలువురు నేతలు పట్టుబడుతున్నట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్‍పీ వేలుమణి వంటి నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పళనిస్వామి అధ్యక్షతన ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి కూడా ఈ నేతలు గైర్హాజరయ్యారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్‌కు మద్దతుగా పలువురు నేతలు ప్రకటనలు సైతం చేస్తున్నారు.
'పార్టీలో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నాయకత్వంలో మార్పు జరగాలని చాలా మంది నేతలు కోరుతున్నారు. పళనిస్వామి లీడర్‌గా కొనసాగితే కొందరు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి' అని అన్నాడీఎంకే మాజీ నేత కేసీ పళనిస్వామి తెలిపారు. పార్టీ ఉన్నత పదవి నుంచి పళనిస్వామి స్వచ్ఛందంగా దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమైంది. అయితే పళనిస్వామి నాయకత్వాన్ని ప్రశ్నించడం ఇదే మొదటిసారి కూడా కాదు. ఎన్నికలకు ముందు కూడా పార్టీలో నాయకత్వ మార్పు జరగాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.
అసెంబ్లీలోనూ రెండు గ్రూపులు
అన్నాడీఎంకేలో అసంతృప్తులు మొదలైనట్టు సోమవారంనాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో బయటపడిందని కొందరు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా సభలోకి వచ్చారు. ఒక గ్రూపులో పళనిస్వామి, కేపీ మునుస్వామి, టీఎన్ సుందరం వంటి నేతలుండగా, మరో గ్రూపులో వేలుమణి, డాక్టర్ విజయ్ భాస్కర్ వంటి నేతలు ఉన్నారు.
అవన్నీ వదంతులే..
కాగా, పార్టీలో అసంతృప్తుల మాట ఉత్తదేనని, అవన్నీ వదంతులేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఇ.సుబ్బయ్య తెలిపారు. పార్టీలో అసంతృప్తులు లేవని, అంతా సజావుగానే ఉందని చెప్పారు. అన్నాడీఎంకేను 'చీల్చే' అధికారం ఎవరికీ లేదన్నారు. దీనిపై మీడియా అత్యుత్సాహం చూపించవద్దని కోరారు.
ఇవి కూడా చదవండి..
బీఎస్ఎఫ్ అధీనంలోకి 45 రోజుల్లో సరిహద్దు ఫెన్సింగ్.. బెంగాల్ సీఎం కీలక నిర్ణయం
భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు