Share News

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు

ABN , Publish Date - May 11 , 2026 | 02:53 PM

చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలైన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రపంచంలోని ఏ శక్తీ భారతదేశాన్ని తలవంచేలా కానీ, అణిచివేయడం కానీ చేయలేదని స్పష్టం చేశారు.

భారతదేశాన్ని ఏ శక్తీ తలవంచేలా చేయలేదు
PM Modi

గాంధీనగర్: చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలయిన సందర్భంగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సోమవారంనాడు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శక్తిమంతమైన సందేశం ఇచ్చారు. పోఖ్రాన్ అణుపరీక్షలను గుర్తుచేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని చెప్పారు. ప్రపంచంలోని ఏ శక్తీ భారతదేశాన్ని తలవంచేలా కానీ, అణిచివేయడం కానీ చేయలేదని స్పష్టం చేశారు.


pm-modi1.jpg

'జాతి ప్రయోజనాలే సుప్రీం. ఎలాంటి ఒత్తిళ్లు మన సంకల్పాన్ని నీరుగార్చలేవు' అని మోదీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా లెక్కచేయలేదని, జాతీయ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధ్యానం ఉంటుందని చెప్పారు. సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదని దేశ దృఢ సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. సర్దార్ పటేల్ విజన్‌ను గుర్తుచేశారు. ధ్వంసం నుంచి నవనిర్మాణం వరకూ సోమనాథ్ జర్నీ చెక్కుచెదరని నాగరికతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే వెయ్యేళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. సోమనాథ్ ఆలయంలో వేదమంత్రాల మధ్య అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


మెగా రోడ్ షో

దీనికి ముందు, ప్రధానమంత్రి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకూ రోడ్‌షోలో పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్‌షోలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ సంప్రదాయ నృత్యాలతో దారిపొడవునా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. కాగా, సోమనాథ్ ఆలయ ప్రాభవాన్ని గుర్తుచేస్తూ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ ఉత్సవాల్లో ప్రధాని విడుదల చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి, తదితర నేతలు ప్రధానిని సన్మానించారు.


ఇవి కూడా చదవండి..

మోదీ చెప్పినవి ప్రబోధాలు కావు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు: రాహుల్

మొదటి సారి అసెంబ్లీకి సీఎం విజయ్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..

Updated Date - May 11 , 2026 | 03:24 PM