Share News

విజయ్ క్యాబినెట్‌లో తొమ్మిది మంది.. కాంగ్రెస్‌కు 3 మంత్రి పదవులు

ABN , Publish Date - May 09 , 2026 | 09:11 PM

టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్‌‌లకు చోటు కల్పించనున్నారు.

విజయ్ క్యాబినెట్‌లో తొమ్మిది మంది.. కాంగ్రెస్‌కు 3 మంత్రి పదవులు
TVK Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తలెత్తిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. అత్యధిక స్థానాల్లో గెలిచిన విజయ్ టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ లైన్ క్లియర్ చేశారు. దీంతో విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. 10వ తేదీ ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.


కాంగ్రెస్‌కు పెద్దపీట

టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్‌‌లకు చోటు కల్పించనున్నారు. తదుపరి మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు చెందిన మరికొందరిని క్యాబినెట్‌లో తీసుకుంటారని తెలుస్తోంది.


IUML.jpg

120కి చేరిన సంఖ్యాబలం

ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచినప్పటికీ రెండు చోట్ల విజయ్ గెలవడంతో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో టీవీకే బలం 107కు చేరింది. టీవీకేకు కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) మద్దతు ప్రకటించడంతో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం ఆ పార్టీకి సమకూరింది. అయితే చివరి నిమిషంలో ఐయూఎంఎల్ సైతం టీవీకేకు బేషరుతుగా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 234 మంది సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలం 120కి చేరింది. కాగా, మూడ్రోజుల్లోగా అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

కొలువు తీరనున్న టీవీకే ప్రభుత్వం... రేపే విజయ్ ప్రమాణస్వీకారం

గవర్నర్ ట్విస్ట్.. చివరి నిమిషంలో విజయ్‌కు అపాయింట్‌మెంట్

Updated Date - May 09 , 2026 | 09:34 PM