Share News

కొలువు తీరనున్న టీవీకే ప్రభుత్వం... రేపే విజయ్ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - May 09 , 2026 | 08:15 PM

తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఈనెల 10న కొలువు తీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో ఆదివారం ఉదయం 10.00 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కొలువు తీరనున్న టీవీకే ప్రభుత్వం... రేపే విజయ్ ప్రమాణస్వీకారం

చెన్నై: తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఈనెల 10న కొలువు తీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో ఆదివారం ఉదయం 10.00 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ అపాయిమెంట్‌ ఇవ్వడంతో శనివారం సాయంత్ర లోక్‌భవన్‌లో ఆయనను విజయ్ కలుసుకున్నారు. టీవీకేకు మద్దతిస్తున్న కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ నేతలు కూడా విజయ్ వెంట గవర్నర్‌ను కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలను విజయ్ గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఇందుకు గవర్నర్ సమ్మతించారు.


కొత్త మంత్రివర్గంలో 9 మందికి అవకాశం

చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తదుపరి మంత్రి వర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.


వరుస ట్విస్టులతో...

ఈనెల 4న వెలువడిన ఫలితాల్లో విజయ్ టీవీకే 108 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన గవర్నర్ మూడుసార్లు విజయ్‌కు అనుమతి నిరాకరించారు. ఈనెల 10వ తేదీతో గవర్నర్ ఇచ్చిన గడువు ముగియనుండటంతో ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. రెండు చోట్ల నెగ్గిన విజయ్ ఒకచోట వదులుకోవాల్సి ఉండటంతో టీవీకే బలం 107కు చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, వామపక్షాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో అది 116కు చేరింది. అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే బేషరుతుగా టీవీకేకు మద్దతు తెలిపింది. దీంతో పూర్తి సంఖ్యాబలం చేకూరిన విజయ్ నాలుగోసారి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అప్పుడు కూడా సస్పెన్స్ కొనసాగింది. కేరళ పర్యటన ఉండటంతో గవర్నర్ అందుబాటులో లేరని చెప్పిన లోక్‌భవనన్ వర్గాలు ఆ తర్వాత కొద్దిసేపటికే గవర్నర్ పర్యటన రద్దయిందంటూ ఆపాయింట్‌‌మెంట్ ఖరారు చేసింది. దీంతో నాలుగోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్‌ పూర్తి సంఖ్యాబలాన్ని గవర్నర్‌ ముందుంచారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

Updated Date - May 09 , 2026 | 08:43 PM