Share News

తమిళనాడు ఎమ్మెల్యేలెవరూ రిసార్ట్‌లో లేరు.. డీకే శివకుమార్

ABN , Publish Date - May 09 , 2026 | 02:54 PM

తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తోసిపుచ్చారు.

తమిళనాడు ఎమ్మెల్యేలెవరూ రిసార్ట్‌లో లేరు.. డీకే శివకుమార్
DK Shivakumar

బెంగళూరు: తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) శనివారంనాడు తోసిపుచ్చారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు.


'తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు వచ్చారనే వార్తల్లో నిజం లేదు. పార్టీ ఆదేశాలను పాటించడమే నాపని. తమిళనాడు అంశం గురించి నాకు తెలియదు' అని మీడియాకు శివకుమార్ తెలిపారు. ప్రైవేటు రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు వచ్చారా అని అడిగినప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రిసార్ట్‌కు రాలేదని అన్నారు. అలాంటి సమాచారం ఏదీ తనవద్ద లేదని, ఉంటే తప్పనిసరిగా చెబుతానని చెప్పారు. రినొవేషన్ పనులు జరుగుతున్నందున రిసార్ట్‌ను మూసివేసినట్టు తెలిపారు. తమిళనాడు ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెళ్లినట్టు కొందరు, బెంగళూరు వచ్చినట్టు కొందరు చెబుతున్నారని, ఈ వార్తలు తాను కూడా పేపరులోనే చూశానని చెప్పారు. పార్టీ అధిష్టానం ఏదైనా అదేశాలు ఇస్తే వాటిని తాను పాటిస్తానని తెలిపారు. అయితే ఇంతవరకూ హైకమాండ్ తనను సంప్రదించలేదని వివరించారు.


కాంగ్రెస్ మేనిఫెస్టో, ప్రచారం కోసం మాత్రమే పార్టీ ఆదేశాలతో తాను తమిళనాడు వెళ్లానని, ఆ తర్వాత నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని డీకే తెలిపారు. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల గురించి తనకు తెలియదని చెప్పారు. పుదుచ్చేరి వెళ్లడంపై అడిగినప్పుడు, చాలాకాలంగా అక్కడి శనీశ్వర ఆలయానికి తాను వెళ్లలేదని, దాంతో ఆ ఆలయాన్ని దర్శించానని చెప్పారు. కేరళం ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై అడిగినప్పుడు, నాయకులతో సంప్రదింపులు సాగుతున్నాయని, ఆ తర్వాతే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి

సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం.. మనసు మార్చుకున్న మమతా బెనర్జీ..

Updated Date - May 09 , 2026 | 04:19 PM