భారీ వర్షాలకు కూలిన వందేళ్ల నాటి భవనం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Aug 06 , 2026 | 10:21 AM
ఉత్తరప్రదేశ్‌లో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కన్నుమూశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహౌలీ వార్డులో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రలో ఉండటంతో శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించారు.
ఈ ఘటనలో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23)తో పాటు వారి ఇద్దరు చిన్నారులు మాధవ్ (2), అద్విక్ (4 నెలలు) ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రతాప్‌గఢ్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లక్నో, మధుర, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా వంటి పలు నగరాల్లో రహదారులు జలమయమై రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పాతబడిన భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News