శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్
ABN , Publish Date - Apr 19 , 2026 | 09:18 PM
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు.
శ్రీనగర్: శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా, మరొకరిని స్థానికుడిగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం వీరిని పోలీసులకు అప్పగించారు.
తురయా, ఇరిడియం శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలపై ఇండియాలో కఠినమైన నిషేధం అమలులో ఉంది. ఎవరైనా విదేశీయులు వీటిని తీసుకువస్తే ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ విభాగంలో ముందుగానే సమచారం ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ప్రత్యేక లైసెన్స్ కూడా పొందాలి. అనుమతులు లేకుండా ఈ పరికరాలను కలిగి ఉంటే నిర్బంధం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటారు.
కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది మేలో పుదుచ్చేరి విమానాశ్రయంలో ఇదే తరహా పరికరం కలగి ఉండటంతో అమెరికాకు చెందిన ఒక డాక్టర్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. చైనా, యూకే దేశాలకు చెందిన వ్యక్తులు అనధికారంగా శాటిలైట్ సామాగ్రి తీసుకువచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాటిలైట్ సామగ్రిపై ఉన్న నిషేధంపై స్పష్టమైన ప్రకటనలు చేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు డీజీసీఏ నుంచి ఆదేశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
సుడిగాలి ప్రచారంలో మరమరాల మిక్చర్‌ను ఆస్వాదించిన మోదీ
స్టాలిన్ చెన్నై సూపర్-6 మేనిఫెస్టో.. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్