Share News

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:14 PM

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్చరించడం సంచలనమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్
Ajal Pal Sharma

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌ మరికొద్ది గంటల్లోనే ప్రారంభమవుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ (Ajay Pal Sharma) రంగంలోకి దిగడం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్చరించడం తాజాగా సంచలనమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రక్రియకు అవాంతరం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఫాల్టా నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్, ఆయన అనుచరులను శర్మ హెచ్చరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. దీనిపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. శర్మ ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగినా ఆయనపై కోర్టుకు వెళ్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం శర్మను బీజేపీకి 'నమ్మకమైన ఏజెంట్'గా అభివర్ణించారు.


ఎవరీ అజయ్‌పాల్ శర్మ

అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ఆయనకు పేరుంది. క్రిమినల్స్‌ నడ్డివిరిచే 'సింగం'గా ఆయనను పిలుస్తారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ కాకముందు ఆయన డెంటల్ సైన్స్ చదివారు. బెంగాల్ రెండోవిడత ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు ఆయనను పరిశీలకుడిగా ఎన్నికల కమిషన్ నియమించింది. మమతా బెనర్జీ మేనల్లుడు అబిషేక్ బెనర్జీ కంచుకోటగా పేరున్న సౌత్ 24 పరగణాల జిల్లాకు పంపింది.


sharma.jpg

స్థానికుల ఫిర్యాదు

సౌత్ 24 పరగణాల జిల్లాకు శర్మ చేరుకోగానే టీఎంపీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు ఓటర్లను భయపెడుతున్నట్టు స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెటనే ఖాన్ నివాసం, కార్యాలయానికి కేంద్ర బలగాలతో చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎవరు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'అందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. ఎవరు అనుచితంగా ప్రవర్తించినా, వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు వచ్చినా వాళ్ల భరతం పడతాం. జహంగీర్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు. వాళ్లకు చెప్పేదొకటే. ఖాన్ అనుచరులు ప్రజలను భయపెడుతున్నట్టు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే కొనసాగితే చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత పశ్చాత్తాప పడి ప్రయోజనం లేదు' అని గట్టి వార్నింగ్ ఇచ్చారు.


మా సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించారు..

కాగా, పార్టీ కార్యాలయం వద్ద తన సెక్యూరిటీ గార్డ్‌ను, ఆ తర్వాత తన కుటుంబసభ్యులను శర్మ బెదిరించే ప్రయత్నం చేశారని ఖాన్ ఆరోపించారు. 'అక్రమ పద్ధతుల్లో బీజేపీకి సహాయం చేసేందుకు వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగూ గెలవలేమని తెలిసే తృణమూల్ కార్యకర్తలు, నేతలను బెదిరిస్తున్నారు. ఇందుకు మేము భయపడం' అని అన్నారు.


బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం

మరోవైపు, అత్యుత్సాహం ప్రదర్శించే ఎవరికైనా గుణపాఠం తప్పదని పేర్కొంటూ శర్మ వీడియోను బీజేపీ షేర్ చేసింది. సౌత్ 24 పరగణాల పరిశీలకుడిగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, యూపీ పోలీస్ సింగం శర్మ మోహరించారని, గత 50 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగకుండా ఎవరూ ఆపలేరని పేర్కొంది. కాగా, తటస్థ పరిశీలకుడి తరహాలో శర్మ వ్యహహారం లేదని తృణమూల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. నిబంధనలను అతిక్రమించి పరిస్థితులను తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటే అందుకు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. తృణమూల్ వాదనను అఖిలేష్ యాదవ్ సమర్ధిస్తూ, శర్మ బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని, 'బీజేపీ ఎజెండా ఏజెంట్ల'పై సరైన సమయంలో దర్యాప్తు జరిపిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య నేరగాళ్లకు విడిచిపెట్టేది లేదని అన్నారు. ఈనెల 29న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగనుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

శబరిమల కేసులో కీలక మలుపు.. సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు

Updated Date - Apr 28 , 2026 | 06:39 PM