శబరిమల కేసులో కీలక మలుపు.. సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 05:40 PM
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల భారీ రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్యాంగ నైతికత, మతపరమైన విశ్వాసాల మధ్య జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైన అంశాన్ని స్పష్టం చేసింది. తాము కేవలం రాజ్యాంగపరమైన ప్రశ్నలపై మాత్రమే దృష్టి పెడుతున్నామని, వ్యక్తిగత ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదని కోర్టు తెలిపింది. నిర్దిష్టమైన ఆలయ సంప్రదాయాల కంటే, మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిధినే తాము సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వాదనల సమయంలో ఒక మహిళా న్యాయవాది అస్సాంలోని కామాఖ్య ఆలయ ఉదాహరణను కోర్టు ముందు ఉంచారు. అక్కడ మహిళల రుతుస్రావాన్ని ఒక వేడుకగా జరుపుకొంటారని ఆమె వివరించారు. అదే సమయంలో, అక్కడ జరిగే జంతు బలులను ఆపాలని ఒక పిటిషనర్ కోరగా.. ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ప్రస్తావనను తోసిపుచ్చింది.
సీనియర్ అడ్వకేట్ శ్రీధర్ పోతరాజు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మతపరమైన విశ్వాసాలను పరీక్షించేటప్పుడు నాస్తికుల అభిప్రాయాలను కోర్టు పరిగణనలోకి తీసుకోకూడదు’ అని ఆయన వాదించారు. మతపరమైన హక్కులు కేవలం భక్తుల కోణం నుంచే చూడాలని, ఆచారాల పట్ల నమ్మకం లేని వారి వాదనలకు ఇక్కడ తావు లేదని ఆయన కోర్టుకు విన్నవించారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్-21 (జీవించే హక్కు)లో అంతర్భాగమని శ్రీధర్ పోతరాజు వాదించారు. మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానాల జోక్యానికి ఖచ్చితమైన పరిమితులు ఉండాలని న్యాయవాదులు కోరారు. వ్యక్తిగత విశ్వాసాలకు, రాజ్యాంగ నైతికతకు మధ్య ఉన్న సమతుల్యతపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్