Share News

33 మంది చిన్నారులపై లైంగిక దాడి.. దంపతులకు ఉరి శిక్ష..

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:53 PM

పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నరరూప రాక్షస దంపతుల పాపం పండింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు ఈ దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది..

33 మంది చిన్నారులపై లైంగిక దాడి.. దంపతులకు ఉరి శిక్ష..
Uttar Pradesh POCSO case

యూపీ, ఫిబ్రవరి 21: అభంశుభం తెలియని పసి పిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కోర్టులు సైతం కఠిన శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయంలో దంపతులకు మరణశిక్ష పడింది. పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ నరరూప రాక్షస దంపతులకు సరైన శిక్షపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌ భవాన్‌.. చిత్రకూట్‌ జిల్లాలో గతంలో నీటిపారుదల శాఖలో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన భార్య దుర్గావతితో కలిసి 2010-2020 మధ్య.. బందా, చిత్రకూట్ ప్రాంతాల్లో బాలురపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వీరి దారుణాలకు బలైన వారిలో మూడేళ్ల వయసు చిన్నారులు కూడా ఉన్నారు. ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్(Online Games), బహుమతులు, తినుబండారాల పేరుతో పిల్లలను మభ్యపెట్టి ఇంటికి రప్పించి ఈ దారుణాలకు ఒడిగట్టారు. ఈ దంపతుల దారుణాలకు సంబంధించిన 2 లక్షల వీడియోలు, ఫొటోలను ఇంటర్నెట్‌ ద్వారా 47 దేశాలకు పంపించారు. నిందితులపై సీబీఐ 2020 అక్టోబరులో కేసు నమోదు చేసింది. మైనర్ బాధితుల పట్ల సీబీఐ దర్యాప్తు సున్నితంగానే కొనసాగింది.


రామ్ భవాన్, అతడి భార్యపై 2021 ఫిబ్రవరిలో సీబీఐ(CBI) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ దంపతుల నుంచి ప్రాణాలతో బయటపడిన పిల్లల్లో కొందరి ప్రైవేట్ భాగాలపై గాయాలు అయ్యాయని, వారిలో కొందరు ఏళ్ల తరబడి ఆసుపత్రులలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఐదేళ్ల పాటు యూపీలోని పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. తాజాగా కోర్టు తుది తీర్పును వెల్లడించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా పోక్సో కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అలానే బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:

మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

Updated Date - Feb 21 , 2026 | 05:06 PM