వర్షాలతో ఇబ్బంది పెడుతున్నాడని ఇంద్రుడిపై యువకుడి ఫిర్యాదు
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:28 PM
చెప్పాపెట్టకుండా అదేపనిగా వర్షాలు కురిపిస్తున్నాడని ఇంద్రుడిపై ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన ఓ యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూరజ్ తివారీ అనే ఆ యువకుడు ఇంద్రుడిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: చెప్పాపెట్టకుండా అదేపనిగా వర్షాలు కురిపిస్తున్నాడని ఇంద్రుడిపై ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన ఓ యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూరజ్ తివారీ అనే ఆ యువకుడు ఇంద్రుడిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. పౌరులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయడానికి ఉద్దేశించిన ‘జన్‌సున్‌వాయి సమాధాన్’ పోర్టల్‌లో అతను కంప్లైంట్ పెట్టాడు. ‘కొన్నిసార్లు భారీ వర్షాలు, మరికొన్నిసార్లు తేలికపాటి వర్షాలు వస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది కలుగుతోంది. ముందే చెప్పకుండా ఇంద్ర దేవుడు వర్షాలు ఎడతెరిపిలేకుండా కురిపిస్తున్నాడు. రోడ్లు, వీధులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లలేకపోతున్నారు. రోజువారి పనులన్నీ స్తంభించిపోయాయి. వర్షాలతో నేను విసుగెత్తిపోయాను. ఇంద్రుడిపై జిల్లా మేజిస్ట్రేట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని సూరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంద్రుడి మొబైల్ నంబర్ తన వద్ద లేదని, ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేటే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు ఆగి ప్రజలకు ఊరట కలిగించేలా ఇంద్రుడికి ఆదేశాలు జారీ చేయాలని అతను విజ్ఞప్తి చేశాడు.
కొద్ది రోజులుగా భారీ వర్షాలు
కాగా.. కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా హర్దోయిలో ఏడుగురు చనిపోయారు. అలాగే పాముకాట్ల ప్రమాదాలు కూడా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో 30 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. 330 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక, ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ సూరజ్ తివారీ చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని ఫిర్యాదుపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే, వ్యవస్థలోని లోపాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యంగ్యంగా చెప్పడానికే సూరజ్ అలా ఫిర్యాదు చేసి ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్
హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్ ఎప్పుడూ చూడలేదు!