యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్.. ఎస్పీ నేతలు ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:33 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆసక్తికరంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆసక్తికరంగా మారాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు దాదాపు 130 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది (UP Assembly Elections 2027).
సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు తమకు కావాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులకు అందించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్థానంలో పోటీ చేసేలా కాంగ్రెస్ ఈ జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యంగా అమేథీ, రాయ్‌బరేలీ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోరింది. కాంగ్రెస్ ఇన్ని స్థానాలు డిమాండ్ చేయడంతో సమావేశానికి వచ్చిన ఎస్పీ నేతలు నిర్ణయం తీసుకోలేకపోయారు (Congress Samajwadi Party Alliance).
ఈ జాబితాపై అఖిలేశ్ యాదవ్‌తో చర్చించి, ఆ తర్వాత తదుపరి సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలకు ఎస్పీ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది (Congress 130 Seats Demand). మంగళవారం మరోసారి చర్చలు జరగనున్నాయి. సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగినప్పటికీ ఇరు పార్టీల నేతలు చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో పొత్తుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదురుతుందని, 2027 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేత ఆరాధనా మిశ్రా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..