Share News

గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:39 PM

గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇర్ఫాన్ సిరాజ్ పడాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..
Godhra Train Burning Case

ఇంటర్నెట్ డెస్క్: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇర్ఫాన్ సిరాజ్ పడాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో పాటు, ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలులో గడిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం (నవంబర్ 23) జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలేతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది (Godhra Train Burning Case).


ఇర్ఫాన్‌కు ఉన్న తీవ్రమైన గుండె సంబంధిత అనారోగ్య పరిస్థితిని గుజరాత్ ప్రభుత్వం కూడా వ్యతిరేకించలేదు. వైద్య కారణాలతో అతడి శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం అంగీకరించింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-6 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 58 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో తీవ్ర మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Godhra Case Bail).


ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం 2011 మార్చిలో 31 మందిని దోషులుగా నిర్ధారించింది (Godhra Train Incident). వారిలో 11 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే, 2017లో గుజరాత్ హైకోర్టు 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదులుగా మార్చింది. కాగా, ఈ కేసులో గతంలోనూ పలువురు దోషులకు సుప్రీంకోర్టు వివిధ కారణాలతో బెయిల్ మంజూరు చేసింది. 2022లో ఇద్దరికి, 2023 ఏప్రిల్‌లో మరో ఎనిమిది మంది దోషులకు బెయిల్ ఇచ్చింది. తాజాగా ఇర్ఫాన్ సిరాజ్ పడాకు వైద్య కారణాలతో బెయిల్ మంజూరు చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్

సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సమావేశం

Updated Date - Nov 23 , 2026 | 02:49 PM