Share News

స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరి..

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:32 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్ఠ స్థాయి నుంచి 2,200 పాయింట్లకు పైగా పడిపోయింది.

స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
Stock Market

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో గరిష్ఠ స్థాయి నుంచి 2,200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50.. 25,400 పాయింట్ల దిగువకు చేరింది. దీంతో మదుపరుల సంపదకు భారీగా గండిపడింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది (Stock Market Crash Today).


దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ నెలలో నిఫ్టీ గణనీయమైన లాభాలను నమోదు చేసింది. వరుసగా నాలుగు వారాల పాటు సూచీలు పెరగడంతో చాలా మంది మదుపర్లు తమ పెట్టుబడులపై వచ్చిన లాభాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు పెరిగాయి. ఇటీవలి ర్యాలీ తర్వాత సూచీలు కీలక గరిష్ఠ స్థాయిలకు చేరువ కావడంతో లాభాల స్వీకరణ జరుగుతోంది (Sensex Today).


సోమవారం మార్కెట్ పతనానికి బ్యాంకింగ్ రంగ షేర్లు ప్రధాన కారణంగా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం వరకు నష్టపోయింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయి (Investors Lose Rs 3 Lakh Crore).


సెన్సెక్స్ చివరకు 1483 పాయింట్ల నష్టంతో 82435 వద్ద రోజును ముగించింది. అలాగే నిఫ్టీ 50 434 పాయింట్లు కోల్పోయి 25349 వద్ద స్థిరపడింది. ఇక, బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2020 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే కదలాడాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.92గా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మొదలైన హెవీ షేర్లు నష్టపోవడంతో బ్యాంక్ నిఫ్టీ భారీగా పతనమైంది.

Updated Date - Nov 23 , 2026 | 03:35 PM