Share News

టీవీకేకి మద్దతుపై వామపక్షాలు, వీసీకే చర్చిస్తున్నాయ్.. త్వరలోనే సరైన నిర్ణయం: బినోయ్ విశ్వం

ABN , Publish Date - May 08 , 2026 | 03:01 PM

టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేత బినోయ్ విశ్వం చెబుతుంటే, అసెంబ్లీ వేదికగా టీవీకే‌కు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేస్తున్నారు.

టీవీకేకి మద్దతుపై వామపక్షాలు, వీసీకే చర్చిస్తున్నాయ్.. త్వరలోనే సరైన నిర్ణయం: బినోయ్ విశ్వం
CPI Signals Support to TVK in Tamil Nadu Hung Assembly

చెన్నై, మే 8: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) ప్రధాన కార్యదర్శి డి. రాజా, CPI కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 4, 2026న వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని(Hung Assembly) సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అత్యధిక స్థానాలు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలని డి. రాజా డిమాండ్ చేశారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న సంప్రదాయాలను, పద్ధతులను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పాటించాలని రాజా పేర్కొన్నారు. ప్రభుత్వ బలాన్ని గవర్నర్ నివాసంలో కాకుండా, అసెంబ్లీ వేదికగా (Floor Test) నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. 1996లో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇచ్చిన విధంగానే, అతిపెద్ద పార్టీకి ఇక్కడ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పుకొచ్చారు. డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) కలిసే అవకాశం ఉందన్న వార్తలపై రాజా స్పందిస్తూ, ఆ విషయంలో తనకు స్పష్టత లేదని, కానీ ప్రజలు వామపక్షాలు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.


టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై సీపీఐ, సీపీఎం, వీసీకే (VCK) పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని సీపీఐ పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం తెలిపారు. కాగా, 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే తాజా ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112కి చేరుకుంది. వామపక్షాల మద్దతు లభిస్తే ఆ సంఖ్య 117కి చేరుతుంది.


ఇవి కూడా చదవండి..

ఏపీ ECET - 2026 ఫలితాల విడుదల

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 03:20 PM