తుక్డే తుక్డే గ్యాంగ్‌ను పార్లమెంటుకు పంపుతున్న టీఎంసీ: మోదీ విమర్శలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:26 PM
బెంగాల్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ తీవ్ర అవినీతి, హింస, బెదిరింపు రాజకీయాలతో అవకతవకల పాలన సాగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ హింస, ప్రతిపక్ష కార్యకర్తలను బెదిరించడం, భయోత్పాత వాతావరణం సృష్టించిందని చెప్పారు
సిలిగురి: బెంగాల్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ (TMC) తీవ్ర అవినీతి, హింస, బెదిరింపు రాజకీయాలతో అవకతవకల పాలన సాగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రాజకీయ హింస, ప్రతిపక్ష కార్యకర్తలను బెదిరించడం, భయోత్పాత వాతావరణం సృష్టించిందని చెప్పారు. విపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో హత్యలు చోటుచేసుకున్నాయని, ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. ఈ పరిస్థితి ఇంకెంతోకాలం సాగదని, రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు.
మే 4 తర్వాత మాదే ప్రభుత్వం
'టీఎంసీ వాళ్లు జాగ్రత్తగా వినాలి. మే 4 తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. గత 15 ఏళ్లుగా టీఎంసీ ప్రతీ చర్యకు, ప్రతీ పైసాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. బెదిరించడం, భయోత్పాతం సృష్టించడం, రాజకీయ హింస, పార్టీ కార్యకర్తలను చంపడం వంటివి టీఎంసీ విధానంగా మారాయి. ఇక చాలు. బెంగాల్ ప్రజలు వీటిని సహించేందుకు సిద్ధంగా లేరు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనేది బీజేపీ మంత్రం. బెంగాల్‌లో సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, టీఎంసీ దోపిడీదారులకు ముకుతాడు వేయడం మా మంత్రం' అని మోదీ అన్నారు.
తుక్డే తుక్డే గ్యాంగ్
టీఎంసీ విభజన ఎజెండాలు జాతీయ ఐక్యత, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. సిలిగురి కారిడార్, ఈశాన్య ప్రాంతాల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ, సిలిగురి కారిడార్‌ను విడదీస్తామని తుక్డే తుక్డే గ్యాంగ్ బెదిరిస్తోంది, అలాంటి వారిని పార్లమెంటుకు టీఎంసీ పంపుతోందని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు గేట్‌వేగా ఉన్న సిలిగురి కారిడార్ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.
మహిళలకు ప్రత్యేక రక్షణ
బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండ, మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల రక్షణకు అవసరమైన పోలీస్ సపోర్ట్ సిస్టమ్ తీసుకువస్తామని, మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వర న్యాయాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. రాజకీయ హింసపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని, నేర, మాఫియా కార్యకలాపాల్లో ప్రమేయమున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు మోదీ లేఖ
ఎన్నికల వేళ ఎందుకీ తొందర... మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ఖర్గే ఘాటు లేఖ