ఎన్నికల వేళ ఎందుకీ తొందర... మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ఖర్గే ఘాటు లేఖ
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:31 PM
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆదరాబాదరాగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆదరాబాదరాగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకుంటున్న చర్యగా కనిపిస్తోందన్నారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించకుండా మళ్లీ తమ సహకారం కోరడం సరికాదని, ఈ చట్టంతో ముడిపడిన కీలకాంశాలపై అర్థవంతమైన చర్చ జరగాలని ఖర్గే అన్నారు. ఇందుకోసం ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
'నారీ శక్తి అభియాన్ 2023 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం మీకు తెలుసు. ఆ సమయంలో తక్షణం ఈ కీలక చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ తరఫున నేను స్వయంగా కోరాను' అని ఖర్గే గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన వివరాలు వెల్లడించకుండా విపక్షాల సహకారాన్ని కేంద్రం కోరుతోందని, డీలిమిటేషన్, ఇతర కీలకాంశాలకు సంబంధించిన వివరాలు లేకుండా ఈ చారిత్రక చట్టంపై అర్థవంతమైన చర్చ సాధ్యం కాదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిందని ప్రధాని పేర్కొన్నారని, అయితే అది నిజం కాదని ఖర్గే అన్నారు. 2026 ఏప్రిల్ 29న ఎన్నికలు ముగుస్తాయని, ఆ తర్వాత ఎప్పుడైనా సరే రాజ్యాంగ సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉద్దేశించినదే అయితే నారీ శక్తి వందన్ అధినియమ్-2023 సవరణతో ముడిపడిన డీలిమిటేషన్‌పై చర్చ జరిపేందుకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే సూచించారు.
ఇవి కూడా చదవండి..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు మోదీ లేఖ
తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం