సూరజ్‌కుండ్ మేళాలో ఘోర ప్రమాదం.. గాల్లో వేలాడిన ప్రాణాలు! వీడియో వైరల్
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:24 PM
హర్యానా ఫరీదాబాద్ సూరజ్‌కుండ్ మేళాలో జరిగిన ఓ భయానక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: హర్యానా(Haryana)లోని ఫరీదాబాద్‌లో రంగు రంగుల వెలుగులు, దేశ విదేశీ సంస్కృతుల కలయికతో సందడిగా సాగుతున్న ‘సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా’లో శనివారం అపశృతి చోటు చేసుకుంది. మేళాలో ఉన్న ‘సునామీ’ (Tsunami) అనే హై-స్పీడ్-రైడ్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో రైడ్(Ride) గాల్లోనే తిరుగుతూ నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది.
అసలేం జరిగిందంటే?
మేళాలోని అమ్యూజ్‌మెంట్ పార్క్ విభాగంలో వేగంగా తిరిగే ‘సునామీ’ రైడ్ (Tsunami Ride)కు పర్యాటకులు క్యూ కట్టారు. రైడ్ మొదలై గాల్లో వేగంగా తిరుగుతోంది. అందరూ కేరింతలు కొడుతున్న సమయంలో రైడ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అది నియంత్రణ కోల్పోయి వేగంగా తిరుగుతూ ఊగిపోయింది. రైడ్ గాల్లో ఉండగా అందులో ఉన్నవాళ్లు భయంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో రైడ్‌లో 15 మంది ఉన్నారు.
సిబ్బంది అప్రమత్తం:
ప్రమాదాన్ని గమనించిన ఆపరేటర్లు పవర్ నిలిపివేసి రైడ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే రైడ్ ఓ వైపు కూలిపోయింది. ఈ సంఘటన జరిగినప్పుడు విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించి.. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. రైడ్‌కు సంబంధించిన భద్రతా చర్యలు, అనుమతులను అధికారులు తనిఖీ చేశారు. మృతిచెందిన ఇన్‌స్పెక్టర్ కుటుంబానికి హర్యానా సీఎం నయాబ్ సైనీ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.