తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ ?
ABN , Publish Date - Jun 14 , 2026 | 06:58 PM
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 14: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం ఇప్పుడు మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ పార్లమెంటరీ లీడర్‌గా ఉన్న ఆరుసార్లు ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు (రెబెల్) క్యాంపులో చేరారు. ఈ తాజా పరిణామంతో మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో రహస్య భేటీలు
నిన్న (శనివారం) ఉదయం ఢిల్లీ చేరుకున్న సుదీప్ బందోపాధ్యాయ్, మరో రెబెల్ ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో ఇప్పటికే 19 మంది ఎంపీలు రెబెల్ క్యాంపులో ఉండగా, సుదీప్ చేరికతో ఆ సంఖ్య 20కి చేరింది.
పార్లమెంటులో ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection Law) నుంచి తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ (28 మందిలో 19 మందికి పైగా) ఇప్పుడు ఈ రెబెల్స్ సొంతమైంది. వీరంతా రేపు (సోమవారం) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించి ఎన్‌డీఏ (NDA) కూటమిలో భాగం చేయాలని కోరే అవకాశం ఉంది.
రెబెల్ గ్రూప్‌కు కొత్త బాస్!
ఇప్పటివరకు ఈ రెబెల్స్ వర్గానికి బారాసత్ ఎంపీ కాకలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, ఆరుసార్లు ఎంపీగా గెలిచిన అత్యంత సీనియర్ నాయకుడైన సుదీప్ బందోపాధ్యాయ్ క్యాంపులోకి రావడంతో, కాకలి స్థానంలో ఆయనే ఈ తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా మంది రెబెల్ ఎంపీలు కూడా సుదీప్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు.
టీఎమ్‌సీ ప్రతీకార చర్యలు.. తీవ్ర విమర్శలు
సుదీప్ బందోపాధ్యాయ్ తిరుగుబాటు విషయం బయటకు రాగానే కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటయింది. గంటల వ్యవధిలోనే పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సుదీప్‌ను ఉత్తర కోల్‌కతా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కునాల్ ఘోష్‌ను నియమించారు. యువజన విభాగం అధ్యక్షురాలిగా ఉన్న సాయోని ఘోష్ (ఈమె కూడా రెబెల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం) స్థానంలో అర్నాబ్ బెనర్జీని నియమించారు.
ఈ పరిణామాలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. సుదీప్ కడుపునొప్పితో కోల్‌కతా ఆసుపత్రిలో చేరానని పార్టీకి అబద్ధం చెప్పి, ముసుగు తీసేసి ఢిల్లీలో అమిత్ షాను కలిశారని మండిపడ్డారు. పార్టీ వీడే స్వార్థపరులు ఎంపీ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
బెంగాల్ అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి
కేవలం లోక్‌సభలోనే కాకుండా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనూ టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 నుంచి 64 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రితాబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. తాజా సంక్షోభం చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయే దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..
జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ