జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ
ABN , Publish Date - Jun 14 , 2026 | 08:07 AM
హఠాత్తుగా జడ్జి సీటులోకి వెళ్లి కూర్చుని హడావుడి చేసిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమెకు మతిస్తిమితం లేదని పోలీసులు తేల్చారు.
ఇంటర్నెట్ డెస్క్: జడ్జి సీటులో ఒక సాధారణ మహిళ కూర్చుని తానే జడ్జి అంటూ కలకలం రేపిన ఘటన వారణాసి జిల్లాలో (యూపీ) ఇటీవల వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని నిర్ధారించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉదయం వేళ ఆ మహిళ కోర్టు రూమ్‌లోకి దూసుకెళ్లింది. అప్పటికి జడ్జి కోర్టు హాల్‌లోకి ఇంకా రాలేదు. జడ్జి కుర్చీ ఖాళీగా ఉండడంతో వారు ఎప్పుడు వస్తారని అక్కడున్న వారిని మహిళ ప్రశ్నించింది. ఆ తరువాత నేరుగా డయాస్ మీదకు వెళ్లి అక్కడ జడ్జి కుర్చీలో కూర్చుంది. తరువాత ఆర్డర్.. ఆర్డర్ అంటూ హడావుడి మొదలెట్టింది. జడ్జి టేబుల్‌పై ఉన్న ఫైళ్లను తిరగేసింది. ఆధారాలను తీసుకురావాలని, సాక్ష్యులను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఆమె హడావుడి చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
డయాస్ మీద నుంచి కిందకు దిగాలని ఆమెకు కోర్టు సిబ్బంది ఎంతగా నచ్చ చెప్పినా మహిళ వినలేదు. తన దగ్గరకు వచ్చే వారిని గద్దించి కిందకు పొమ్మని చెప్పింది. ఈలోపు అక్కడికి వచ్చిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమెకు మానసిక సమస్యలతో బాధపడుతోందని తేల్చారు. చివరకు, మహిళను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి:
విమానం రెక్కపై తేనెటీగల గుంపు.. టేకాఫ్ సమయంలో ఏం జరిగిందంటే?
ఇలాంటివి భారతీయులకే సాధ్యం.. దోమల నుంచి రక్షణకు సూపర్ ట్రిక్..