Share News

అయోధ్య నుంచి సీతమ్మ ఊరికి రైలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:20 AM

భారత్‌లో తొలి విదేశీ పర్యటనకు వచ్చిన నేపాల్‌ ప్రధాని బాలెన్‌షా సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు

అయోధ్య నుంచి సీతమ్మ ఊరికి రైలు
modi with balensha

  • అయోధ్య నుంచి సీతమ్మ ఊరికి రైలు

  • నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ

  • మోదీ-బాలేన్‌ షా సమక్షంలో ఎనిమిది ఎంవోయూలపై సంతకాలు

న్యూఢిల్లీ, నవంబరు 23: భారత్‌లో తొలి విదేశీ పర్యటనకు వచ్చిన నేపాల్‌ ప్రధాని బాలెన్‌షా సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఉభయులూ కీలకాంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటీవల వరదలకు విలవిలలాడిన నేపాల్‌ పునర్నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని మోదీ ప్రకటించారు. రామజన్మభూమి అయోధ్య నుంచి నేపాల్లో సీతమ్మ పుట్టిన జనక్‌పూర్‌ ధామ్‌ వరకు సరయు-కమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడంతో పాటు భారత్‌ సాయంతో నేపాల్లో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఇద్దరూ కలిసి శంకుస్థాపన చేశారు. వారి సమక్షంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, పోలీసింగ్‌, ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ, ఆరోగ్యసంరక్షణ, సంప్రదాయ ఔషధాలు, పట్టణాభివృద్ధి, పశుసంవర్ధకం, మత్స్య సంపద అభివృద్ధి రంగాల్లో 8 అవగాహనా ఒప్పందా(ఎంవోయూ)లపై సంతకాలు జరిగాయి. భారత్‌కు తొలి ద్వైపాక్షిక పర్యటనకు వచ్చిన బాలేంద్రషాకు మోదీ హైదరాబాద్‌ హౌస్‌లో స్వాగతం పలికారు. ఆయన ప్రపంచంలోనే యువ ప్రధానమంత్రి అని.. కొద్దినెలల కిందట ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిచినప్పుడు ఆయన విజన్‌ స్పష్టంగా అర్థమైందని ప్రధాని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. సోమవారం కొద్దిగంటలపాటు జరిగిన చర్చల్లో నేపాల్‌ భవిష్యత్‌-ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన నిబద్ధత తెలిసిందన్నారు.


‘ఆగస్టు వరదలకు అతలాకుతలమైన నేపాల్‌ పునర్నిర్మాణానికి, దీర్ఘకాలిక అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీ (26వేల కోట్ల నేపాలీ రూపాయలు) ప్రకటిస్తున్నాను. బాధిత కుటుంబాల జీవితాలను తిరిగి గాడిలో పెట్టేందుకు, వారికి కొత్త అవకాశాలు కల్పించేందుకు, భవిష్యత్‌లో విపత్తులను ఎదుర్కోవడానికి భారత్‌ కట్టుబడి ఉంది. రెండు దేశాల మధ్య మత, సాంస్కృతిక సంబంధాలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఉమ్మడి నాగరికత, విశ్వాసాలకు శ్రీరాముడు, సీతాదేవి చిహ్నాలు. అందుకే అయోధ్య-జనక్‌పూర్‌ నడుమ రైలు ప్రారంభించాం. నేపాల్‌ లేకుండా మన తీర్థయాత్రా స్థలాలు అసంపూర్తిగా ఉన్నట్లేనని.. నేపాల్‌ లేనిదే శ్రీరాముడు సంపూర్ణుడు కాదని 2018లో జనక్‌పూర్‌ సందర్శన సందర్భంగా నేను చెప్పాను. సరయు-కమల ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభంతో భారత్‌-నేపాల్‌ పవిత్ర బంధానికి కొత్తకోణం జతకానుంది’ అని మోదీ తెలిపారు.
హిమాలయాలంత సుదృఢ బంధం..

బాలేన్‌షా మాట్లాడుతూ.. పరస్పర గౌరవం, విశ్వాసం, సత్సంకల్పం ప్రాతిపదికగా భారత్‌-నేపాల్‌ సంబంధాలు ఉన్నాయని.. ఈ బంధం హిమాలయ పర్వతాలంత సుదృఢంగా.. సముద్రమంత విశాలంగా ఉందని తెలిపారు. విశ్వసనీయ పొరుగుదేశంగా.. నేపాల్లో ప్రకృతి విపత్తులు, సంక్లిష్ట సమయాల్లో భారత్‌ ఎల్లప్పుడూ మొట్టమొదటి తక్షణ సహాయకారిగా నిలుస్తోందన్నారు. తన పర్యటనలో కుదిరిన ఒప్పందాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు. 2026 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక బాలేన్‌షా రెండ్రోజుల పర్యటన నిమిత్తం తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. సోమవారం మోదీతో భేటీకి ముందు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. తర్వాత రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీకి నివాళులర్పించారు.

604 కిమీ.. 19 గంటలు..

సరయు-కమల ఎక్స్‌ప్రెస్‌ యూపీలోని అయోధ్య నుంచి నేపాల్లోని జనక్‌పూర్‌ ధామ్‌ వరకు 604 కిమీ ప్రయాణిస్తుంది. 19 గంటల సమయం పడుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి వారానికోసారి రెండువైపులా నడుస్తుంది.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 02:50 AM