మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి: మోదీ పిలుపు
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:38 PM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై మోదీ విమర్శల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కుమ్మక్కై దిగువసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించారని, ఇందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు.
బిష్ణుపూర్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శల దాడి కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కుమ్మక్కై దిగువసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిందని, ఇందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిష్ణుపూర్‌లో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, వికసిత్ భారత్ కలల సాకారం, దేశాభివృద్ధికి భారత రాజకీయాల్లో మహిళలకు మరింత భాగస్వామ్యం కల్పించాలని కేంద్రం కోరుకుంటోందని అన్నారు. అయితే బెంగాల్ తల్లులు, చెల్లెళ్లను టీఎంసీ వంచించిందని ఆరోపించారు. ప్రజలను నిరంతరం దోచుకోవడమే కాకుండా బెంగాల్ మహిళలకు దక్కాల్సిన హక్కులను టీఎంసీ దక్కనీయడం లేదని తప్పుపట్టారు.
'బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుతున్నారు. ఇందుకు నేను భరోసా కూడా ఇచ్చాను. 2029 నుంచే రిజర్వేషన్ అమలు చేయాలని మహిళల కోరికగా ఉంది. అందుకోసం మేము ప్రయత్నాలు సాగించాం. అయితే తమ మహా జంగిల్ రాజ్‌ను సవాలు చేస్తారనే కారణంగా మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి టీఎంసీ ఇష్టపడటం లేదు. 33 శాతం రిజర్వేషన్ మహిళలకు దక్కకుండా కాంగ్రెస్‌తో కలిసి టీఎంసీ కుట్రపూరితంగా అడ్డుకుంది' అని ప్రధాని విమర్శలు గుప్పించారు.
బెంగాల్‌లో బీజేపీ గెలుపు తథ్యం
భారతీయ జనాతా పార్టీ అంటేనే మహిళా సాధికారత, భద్రతకు కట్టుబడిన పార్టీ అని, ఆ కారణంగానే బీజేపీకి మహిళల నుంచి నిరంతర ఆదరణ లభిస్తోందని మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, అది తెలిసే ప్రజలను టీఎంసీ బెదిరిస్తోందని విమర్శించారు. 'టీఎంసీ గూండాలు' వెంటనే లొంగిపోవాలని, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్, టీఎంసీలు గిరిజన వ్యతిరేకులని, 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అభ్యర్థిని పోటీగా నిలబెట్టారని విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం వస్తే పేద మహిళలకు ఉచిత రేషన్ ఇస్తామని, ప్రజల రేషన్‌ను ఎవరూ తన్నుకుపోనీయమని చెప్పారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్