అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:45 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అవినీతిలో ప్రధానమంత్రి మోదీకి దీదీ ఏమాత్రం తక్కువ కాదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ విమర్శించారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయితేనే ఉద్యోగం వస్తుందని, సామాన్యులకు ఎదురుచూపులే మిగులుతున్నాయని అన్నారు. అవినీతిలో ప్రధానమంత్రి మోదీకి దీదీ ఏమాత్రం తక్కువ కాదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ విమర్శించారు.
'టీఎంసీ అవినీతి గురించి బెంగాల్ ప్రజలందరికీ తెలుసు. ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎప్పుడూ దీదీ జోలికి వెళ్లలేదు. ఎందుకంటే అసలైన పోరాటం టీఎంసీతో కాదనే విషయం వాళ్లకు బాగా తెలుసు. బీజేపీతో పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ ఓట్ల చోరీ చేస్తుంది. ఓట్ల చోరీతోనే మహారాష్ట్ర, హర్యానాలో వాళ్లు గెలిచారు' అని రాహుల్ ఆరోపించారు.
బీజేపీ, టీఎంసీ అవినీతే వల్లే పశ్చిమబెంగాల్ అతలాకుతలమైందని, రాష్ట్ర యువత నిరాశానిస్పృహల్లో ఉన్నారని, మహిళలకు భద్రత లేదని, ఆ కారణంగానే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాహుల్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమని, బీజేపీని ఓడించ గలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడే పార్టీ అని, బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ తాము రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యత్ర నిర్వహించిందని, ప్రధానమంత్రి మాత్రం దేశాన్ని విడగొట్టేందుకు నిరంతరం యాత్రలు సాగిస్తుంటారని విమర్శించారు. 56 అంగుళాలు ఛాతీ ఉందని చెప్పుకునే ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర యూఎస్ నేతల ముందు తలవంచుతారని విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎన్నడూ ఎవరికీ తలవంచలేదని, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన ఎందరో నేతలు ఎవరి ముందు తలవంచలేదని, వారే నిజమైన దేశభక్తులని కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ