బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:45 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తాను జరిపిన విస్తృత పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మిక ఎదుగుదల పరంగా తనకెంతో ఉపకరించిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ (Open letter) రాశారు. రాష్ట్రంలో తాను జరిపిన విస్తృత పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మిక ఎదుగుదల పరంగా తనకెంతో ఉపకరించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రాభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచానని, అయినప్పటికీ ఈ లేఖ ద్వారా తన మనోభావాలని రాష్ట్ర ప్రజలందరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు.
బెంగాల్ సోదర, సోదరీమణుల్లారా అంటూ ప్రధాని తన లేఖను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో అసాధారణ శక్తిని తాను అనుభూతి పొందానని, తీవ్రమైన వేడి, వరుస ర్యాలీల్లో పాల్గొన్నప్పటికీ తనకెలాంటి అలసట రాలేదని చెప్పారు. 'ఈ ర్యాలీలు, రోడ్‌షోలు నాకొక యాత్రలాంటి అనుభూతినిచ్చింది. మా కాళి భక్తులతో కలిసి నేను ఎప్పుడు వెళ్లినా ఆ తల్లి నాలో రెట్టించిన శక్తిని నింపుతున్నట్టు అనిపిస్తుంది. 2024 జనవరిలో అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగిన 11 రోజులు ఉపవాసం చేశాను. అప్పటిలాగా బెంగాల్ ప్రచారంలో కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభూతే నాకు కలిగింది' అని మోదీ వెల్లడించారు.
బెంగాల్‌లో పాల్గొన్న ర్యాలీలు, రోడ్‌షోలలో ప్రజల నుంచి హృదయాన్ని కదలించే ఎన్నో మెసేజ్‌లు, ఫోటోలు తనకు అందాయని, వాటిని ఎప్పటికీ మరచిపోలేనని మోదీ తెలిపారు. ఎంత అర్ధరాత్రయినా వీలు చూసుకుని వాటిని చదవడంతో పాటు స్పందిస్తుంటానని చెప్పారు. యువకులు, మహిళలు, ఆడకూతుళ్లు, పెద్దలు సహా అన్ని వయస్సుల వారు చూపిస్తున్న ఆదరణ మరువలేనని, వారే తనకు అత్యంత విలువైన సంపద అని అభివర్ణించారు. బెంగాల్ సత్వర అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్న విషయం తాను గ్రహించానని, యువత ప్రగతిపథం వైపు దూసుకువెళ్లే అవకాశాల కోసం, ఆడకూతుళ్లు ఆకాశమే హద్దుగా అవకాశాలు అందిపుచ్చుకోవడం, భద్రత కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా మార్పు కావాలనే ఏకైక సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని తెలిపారు. సురక్షిత బెంగాల్‌కు తాను బాధ్యత తీసుకుంటానని, సవాళ్లను అవకాశాలుగా మార్చేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. 'రాష్ట్రంలో బీజీపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలంతా కలిసివస్తారనే నమ్మకం నాకుంది. మనమంతా కలిసి అభివృద్ధి చెందిన బెంగాల్‌ను నిర్మించుకుందాం' అంటూ ప్రధాని ఆ లేఖను ముగించారు.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా